మూడు రాజధానులకు మద్దతు ఇవ్వండి: అమిత్ షాను కోరిన జగన్

By telugu teamFirst Published Dec 16, 2020, 7:24 AM IST
Highlights

మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హోం మంత్రి అమిత్ షాను కోరారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కూడా జగన్ అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.

న్యూఢిల్లీ: మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు. అధికార వికేంద్రీకరణ, ఏపీ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించే విధంగా ప్రణాళిక వేసుకున్నామని ఆయన అమిత్ షాకు చెప్పారు. విశాఖపట్నాన్ని, పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజదానిగా చేస్తూ ఆగస్టులో చట్టం చేసిన విషయాన్ని ఆయన చెప్పారు. 

బిజెపి 2019 ఎన్నికల ప్రణాళికలో కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. హోం మంత్రితో జరిగిన చర్చల వివరాలను వెల్లడిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 

రెండవ రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేట్‌ (2వ ఆర్‌సీఈ) ప్రకారం 2017–18 ధరల సూచీని అనుసరించి పోలవరం ప్రాజెక్టుకోసం అయ్యే రూ, 55,656 కోట్ల రూపాయల ఖర్చును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖలకు ఆదేశాలు ఇవ్వాలని జగన్ కోరారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాస పనులకయ్యే ఖర్చును రీయింబర్స్‌ చేయాలని కూడా ఆయన హోం మంత్రిని కోరారు. 

2005–06తో పోలిస్తే 2017–18 నాటికి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, 44,574 కుటుంబాల నుంచి 1,06,006కు పెరిగిందని, అలాగే ముంపునకు గురవుతున్న ఇళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని, దీనివల్ల ఆర్‌ అండ్‌ ఆర్‌కోసం పెట్టాల్సిన ఖర్చు గణనీయంగా ఆయన చెప్పారు. పోలవరం నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ.1779 కోట్ల రూపాయలను రియింబర్స్‌ చేయాల్సి ఉందని తెలిపారు. 

2018 డిసెంబర్‌కు సంబంధించిన ఈబిల్లులు పెండింగులో ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఖర్చు ఇంకా  పెరిగిపోతుందని, ఏపీకి ప్రాణాధారమైన ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు  జాతీయ ప్రాజెక్ట్ పోలవరాన్ని సత్వరం పూర్తిచేయడానికి తగిన విధంగా సహాయం అందించాలని కోరారు. 

కోవిడ్‌ సమయంలో తీసుకున్న చర్యలను జగన్ అమిత్ షాకు వివరించారు. ప్రజల ప్రాణాలను కాపాడ్డమేకాకుండా, ప్రజల జీవనోపాధికి ఇబ్బందులు రాకుండా, రెండింటి మధ్య సమతుల్యత పాటిస్తూ ముందుసాగిన విషయాన్నిఆయన వివరించారు. అత్యంత క్లిష్టమైన కోవిడ్‌సమయంలో వివిధ పథకాల ద్వారా పేద ప్రజలను ఆదుకున్న తీరును వివరించిన సీఎంకోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేయడానికి ఉద్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని, వ్యాక్సిన్‌ సరఫరాలో అత్యంత కీలకమైన కోల్డ్‌చైన్ల ఏర్పాటు, నిర్వహణకు సమాయత్తంగా ఉన్నామని ఆయన వివరించారు. 

ప్రత్యేక హోదా ఇవ్వండి.....

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా ఆయన అమిత్ షాను కోరారు. ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పారు కోవిడ్‌ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అదనపు రుణాలు తెచ్చుకునేందుకు రాష్ట్రాలకు అనుమతినిచ్చిందని, దీనికోసం నిర్దేశించిన మార్గదర్శకాల అమల్లో భాగంగా కేంద్ర విద్యుత్‌ శాఖ సర్టిఫికెషన్‌ ఇవ్వాల్సి ఉందని, ఈ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని, అందుకు కేంద్ర విద్యుత్‌ శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. 

2013–14 నుంచి 2018–19 వరకూ ప్రజా పంపిణీ ద్వారా సబ్సిడీ బియ్యం పంపిణీకి సంబంధించి కేంద్రం రాష్ట్రానికి ఇంకాచెల్లించాల్సి ఉన్న రూ.1600 కోట్లను వెంటనే విడుదల చేయాల్సిందిగా చూడాలని కూడా జగన్ హోం మంత్రిని కోరారు. అలాగే 2020 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకూ రాష్ట్రానికి రూ.4308.46 కోట్ల రూపాయలు ఉన్న జీఎస్టీ బకాయిలను వెంటనే చెల్లించేలా చూడాలని ఆయన కోరారు. .

14వ ఆర్థిక సంఘం ప్రకారం స్థానిక సంస్థలకు బకాయిపడ్డ రూ. 1111.53 కోట్ల గ్రాంట్లను వెంటనే విడుదల చేయాల్సిందిగా కూడా కోరారు. 15వ ఆర్థిక సంఘం ప్రకారం స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన గ్రాంట్ల బకాయిలు రూ.1954.5 కోట్లను విడుదలచేయాల్సిందిగా కోరారు. 

click me!