విశాఖ జిల్లాలో పిడుగుపాటు... ఓ మహిళ మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

By Arun Kumar PFirst Published Jun 5, 2020, 12:49 PM IST
Highlights

విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం మొగలిపురంలో విషాదం చోటుచేసుకుంది. 

విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం మొగలిపురంలో విషాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం గ్రామ శివారులో పిడుగుపడి ఉపాధి కూలీ బైలపూడి చెల్లమ్మ(59) అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సింగంపల్లి చెల్లమ్మ(40), శిరపురపు రమణమ్మ (40) పరిస్థితి విషమంగా ఉంది. వారిద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

మహారాష్ట్రలో తీరందాటిన నిసర్గ తుఫాన్‌ బలహీనపడి ఈశాన్యంగా పయనించి వాయుగుండంగా మారింది. ఇది గురువారం ఉదయానికి విదర్భ, మధ్యప్రదేశ్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో వీచిన గాలులతో ఉత్తర కోస్తాలో అనేకచోట్ల గాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. కొత్తవలస, అనకాపల్లి, గోకవరం, ఎలమంచిలిలో 4సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది. ఈ నెల 8నాటికి పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ప్రకటించింది. దీని ప్రభావంతో 9, 10 తేదీల్లో రాయలసీమ, కోస్తాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. 

శుక్ర, శనివారాల్లో ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలుప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 

 

click me!