కొండపల్లిలో గుండెలు పిండేసే ఘటన... పసికందును సంచిలో కుక్కి తరలిస్తూ పట్టుబడ్డ వృద్దుడు (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 29, 2023, 10:19 AM IST
Highlights

రోజులు కూడా నిండని పసిగుడ్డును అత్యంత దారుణంగా ఓ సంచిలో కుక్కి తరలిస్తున్న వృద్దుడు పోలీసులకు చిక్కాడు. 

విజయవాడ : తల్లి ఒడిలో వుండాల్సిన పసిగుడ్డును ఓ సంచీలో వేసుకుని తీసుకువెళుతూ పట్టుబడ్డాడో వృద్దుడు. పసికందు ఏడుపు విన్న ఓ ఆటోడ్రైవర్ అనుమానంతో వృద్దుడి వద్దగల సంచి తెరిచి చూసి షాకయ్యాడు. సంచిలోని రోజులు కూడా నిండని పసికందు వుండటంతో ఆటోడ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. తీవ్ర అనారోగ్యంతో వున్న శిశువును పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

పోలీసులు, ఆటో డ్రైవర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణంలోని ఖిల్లా రోడ్డులో ఓ వృద్దుడు ఆటో ఎక్కాడు. అయితే అతడి చేతిలోని సంచిలోంచి పిల్లాడి ఏడుపుశబ్దం వినిపించడంతో వెంటనే ఆటో ఆపిన డ్రైవర్ వృద్దుడిని నిలదీసాడు. అతడు సమాధానం చెప్పకపోవడంతో బలవంతంగా సంచి తెరిచి చూడగా అందులో పసికందు వుంది. దీంతో వెంటనే ఆటోడ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. 

వీడియో

పోలీసుల సూచనతో వృద్దుడి దగ్గరున్న పసికందును కొండపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించాడు ఆటో డ్రైవర్. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు అనారోగ్యంతో వున్న పసికందును  వైద్యసిబ్బందికి అప్పగించారు. వ‌ృద్దుడిని విచారించగా ఆ బిడ్డను తల్లిదండ్రులే తనకు అప్పగించినట్లు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. 

రెండు రోజుల క్రితం విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పటల్లో జంగారెడ్డిగూడెంకు చెందిన ఓ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే అందులో ఓ పసికందు ఆరోగ్యం బాగోలేకపోవడంతో తల్లిదండ్రులు తనకు అప్పగించినట్లు వృద్దుడు చెబుతున్నాడు. సరిగ్గా నడవలేని స్థితిలో వుండటంతో బిడ్డను సంచిలో వేసుకుని తీసుకువెళుతున్నట్లు వృద్దుడు చెబుతున్నాడు.  

Read More  స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. అవమానిస్తోందని, దూరం పెడుతోందని అక్కసుతో హత్య.. రైలు పట్టాలపై ఆత్మహత్మ..

అయితే ఆ పసికందుకు వృద్దుడు ఏమవుతాడు? అనారోగ్యంతో వున్న బిడ్డను అతడు ఎక్కడికి తరలిస్తున్నాడు? విజయవాడ నుండి కొండపల్లికి ఎందుకు తీసుకువచ్చాడు? అన్నది తెలియాల్సి వుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి వృద్దుడిని విచారిస్తున్నారు పోలీసులు. 

తీవ్ర అనారోగ్యంతో వున్న పసికందుకు మెరుగైన వైద్యం కోసం విజయవాడ జిజిహెచ్ కు తరలిస్తున్నట్లు కొండపల్లి ప్రభుత్వాస్పత్రికి వైద్యసిబ్బంది తెలిపారు. ఆ బిడ్డ తల్లిదండ్రుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని... వారికే ఈ బిడ్డను అప్పగించనున్నట్లు వైద్యసిబ్బంది తెలిపారు.
 

click me!