వైసిపిలో చేరిన వేమిరెడ్డి..టిడిపికి షాక్

First Published Jan 28, 2018, 11:14 AM IST
Highlights
  • 73వ రోజు గూడూరులో పాదయాత్ర చేస్తున్న జగన్ ను వేమిరెడ్డి కలుసుకుని పార్టీ కండువా కప్పుకున్నారు.

నెల్లూరు జిల్లాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపిలో చేరారు. 2014 ఎన్నికల్లో పరోక్షంగా వైసిపికి అండదండలు అందించిన వేమిరెడ్డి ఆదివారం ప్రత్యక్షంగా తన మద్దతుదారులతో పార్టీలో చేరారు. జగన్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. ప్రస్తుతం 73వ రోజు గూడూరులో పాదయాత్ర చేస్తున్న జగన్ ను వేమిరెడ్డి కలుసుకుని పార్టీ కండువా కప్పుకున్నారు.

పోయిన ఎన్నికల్లో వైసిపికి పూర్తిస్దాయి అండదండలందిచిన వేమిరెడ్డి రాజ్యసభ స్ధానం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే, పార్టీకి దక్కేది ఒకే స్ధానం కావటంతో దాన్ని విజయసాయిరెడ్డికి కేటాయించారు. దాంతో అలిగిన వేమిరెడ్డి వైసిపికి దూరమైపోయారు. అదే సమయంలో ఆయన్ను టిడిపిలోకి లాక్కోవాలని చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ ఎందుకనో ఏ  ప్రయత్నమూ ఫలించలేదు.

మొత్తానికి వేమిరెడ్డి రాజకీయ రంగానికి దూరంగానే ఉన్నారు. ఈ నేపధ్యంలోనే వైసిపి తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు వేమిరెడ్డిని పార్టీలోకి తీసుకురావటానికి ప్రయత్నించారు. జగన్ తో మాట్లాడిన తర్వాత జగన్ తరపున వేమిరెడ్డికి పెద్దిరెడ్డి హామీనే ఇచ్చారట. దాంతో ఆయన వైసిపిలో చేరటానికి రంగం సిద్ధమైంది. పార్టీ నేతలు చెప్పిన ప్రకారం త్వరలో వైసిపికి దక్కుతుందని అనుకుంటున్న ఒక్క స్ధానాన్ని వేమిరెడ్డికి ఇచ్చేందుకు జగన్ అంగీకరించారట. దాంతో వేమిరెడ్డి వైసిపిలోకి లైన్ క్లియరైంది.

నిజానికి వేమిరెడ్డి టిడిపిలో చేరటం వల్ల ఆ పార్టీకి ఒనగూరే లాభమంటూ పెద్దగా ఏమీ ఉండదు. కానీ వైసిపిలో చేరినందువల్ల జగన్ కు చాలా లాభాలే ఉన్నాయి. ఎలాగంటే, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే రెండు ప్రధాన పార్టీల అభ్యర్ధులకు చేతిచమురు వదిలిపోవటం ఖాయం. ఈ పరిస్దితుల్లో అధికారంలో ఉంది కాబట్టి టిడిపికి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. మరి, వైసిపి పరిస్ధితేంటి?

ఆర్ధిక వనరుల్లో వైసిపి ఏ దశలోనూ టిడిపితో పోటీ పడే అవకాశాలు లేవన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి నేపధ్యంలో ఆర్ధికంగా బలమైన వేమిరెడ్డి లాంటి వాళ్ళు వైసిపిలో చేరటం వల్ల పార్టీకి ఆర్ధికంగా బాగా ఉపయోగం. అంటే వైసిపికి జరిగే లాభమే టిడిపికి నష్టమని చెప్పక తప్పదు.

 

click me!