టిడిపి అభ్యర్ధి ఎప్పుడో గెలిచేసాడట...

First Published Aug 19, 2017, 2:09 PM IST
Highlights
  • ఫిరాయింపు ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి మరణించిన దగ్గర నుండి పోటీ లేకుండా ఏకగ్రీవంగా సీటును లాక్కుందామని ప్రయత్నించిన మాట వాస్తవం.
  • ఎప్పుడైతే ఉపఎన్నిక అనివార్యమని తేలిందో అప్పటి నుండి మంత్రులు, ఎంఎల్ఏ, ఎంఎల్సీలు, నేతలందరినీ నంద్యాలలోనే మోహరించారు చంద్రబాబు.
  • గడచిన రెండు నెలలుగా మంత్రులకు టార్గెట్లు పెట్టి మరీ ప్రచారం చేయిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
  • ఇక, ఉపఎన్నికలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయటం, వివిధ సామాజికవర్గాల వారీగా నేతలకు తాయిలాల పంపిణీ అందరూ చూస్తున్నదే.

‘నంద్యాల ఉపఎన్నికలో టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపుపై ఏమీ అనుమానం లేదు...మెజారిటీ ఎంతన్నదే చూడాలి’ ...ఇది చంద్రబాబునాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు. శనివారం నంద్యాలలో చంద్రబాబు రోడ్డుషో నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, తన గురించి, తన పరిపాలన గురించి అనేక విషయాలు చెప్పారు. గెలుపోటములు దైవా ధీనాలు. కాబట్టి గెలుపు, మెజారిటీ విషయాలను పక్కనపెట్టి గడచిన రెండు నెలలుగా నంద్యాలలో టిడిపి ఏం చేస్తోందో చూద్దాం.

ఫిరాయింపు ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి మరణించిన దగ్గర నుండి పోటీ లేకుండా ఏకగ్రీవంగా సీటును లాక్కుందామని ప్రయత్నించిన మాట వాస్తవం. ఎప్పుడైతే ఉపఎన్నిక అనివార్యమని తేలిందో అప్పటి నుండి మంత్రులు, ఎంఎల్ఏ, ఎంఎల్సీలు, నేతలందరినీ నంద్యాలలోనే మోహరించారు చంద్రబాబు.

గడచిన రెండు నెలలుగా మంత్రులకు టార్గెట్లు పెట్టి మరీ ప్రచారం చేయిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక, ఉపఎన్నికలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయటం, వివిధ సామాజికవర్గాల వారీగా నేతలకు తాయిలాల పంపిణీ అందరూ చూస్తున్నదే.

అంతేకాకుండా, ప్రత్యర్ధి పార్టీ నేతల ఇళ్ళపై పోలీసులతో దాడులు చేయించటం, ఒత్తిళ్ళకు గురిచేసి లాక్కోవాలని ప్రయత్నించటం, కుదరకపోతే కేసులు నమోదు చేయటం లాంటివన్నీ ఎవరు చేసారో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక, ఎన్నికలన్నాక డబ్బు ప్రవాహం గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు.

వందల కోట్ల రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు వైసీపీ నేతలు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు. దానికి తగ్గట్లే, పలువురు చోటామోటా నేతలు డబ్బులు పంచుతూ దొరికారు కూడా.

అంతెందుకు, చంద్రబాబు బావమరది కమ్ సినీనటుడు కమ్ హిందుపురం ఎంఎల్ఏ బాలకృష్ణ డబ్బులు పంచుతూ రెండు రోజుల క్రితమే అడ్డంగా బుక్కైపోయింది నిజం కాదా? భూమా విజయం ఎప్పుడో ఖాయమైపోతే, మరి టిడిపి ఇవన్నీ ఎందుకు చేసినట్లు? అన్నీ వ్యవస్ధలనూ లొంగదీసుకుని అవసరమైనప్పుడల్లా ప్రత్యర్ధులపైకి ఉసిగొల్పుతూ ఎన్నికల్లో తమ అభ్యర్ధి ఎప్పుడో గెలిచేసాడని చెప్పుకోవటం చంద్రబాబుకే చెల్లింది.

 

click me!