అమరావతి పాదయాత్రకు కౌంటర్ ప్లాన్.. 3 రాజధానులకు మద్దతుగా రివర్స్ యాత్ర!.. పెరగనున్న పొలిటికల్ హీట్..

By Sumanth KanukulaFirst Published Oct 19, 2022, 10:29 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు.. రెండో విడత పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మరోవైపు మూడు రాజధానులకు మద్దుతగా ఏర్పాటైన ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ భవిష్యత్తు కార్యచరణను సిద్దం చేసే పనిలో ఉంది. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు.. రెండో విడత పాదయాత్ర చేపట్టారు. తొలి విడతలో అమరావతి తిరుపతి వరకు పాదయాత్ర చేయగా.. ఇప్పుడు అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్రకు అధికార వైసీపీ మినహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. పలుచోట్ల విపక్ష పార్టీల నాయకులు అమరావతి రైతుల పాదయాత్రకు స్వాగతం పలుకుతున్నారు. 

అయితే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మాత్రం వికేంద్రీకరణే తమ సిద్దాంతమని పలు సందర్బాల్లో స్పష్టం చేశారు. దీంతో వైసీపీ నాయకులు అమరావతి రైతుల పాదయాత్ర రియల్ ఎస్టేట్ యాత్రగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పడిన ఉత్తారంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీకి వైసీపీ దన్నుగా నిలిచింది. నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపునిచ్చిన విశాఖ గర్జనలో మంత్రులు, వైసీపీ నాయకులే అధికంగా కనిపించారు. ఈ కార్యక్రమానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఆ రోజు వర్షం పడటంతో ఊహించిన స్థాయిలో జనాలు రాకపోవడం.. విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద చోటుచేసుకున్న పరిణామాలతో పవన్ కల్యాణ్ పర్యటన హైలెట్ కావడంతో విశాఖ గర్జన పెద్దగా జనాల్లోకి వెళ్లలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పుడు మూడు రాజధానులకు మద్దతుగా, అమరావతి రైతుల పాదయాత్రకు కౌంటర్‌ ప్లాన్ సిద్దం చేసేందుకు కొన్ని సంఘాలు ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మేధావులు, విద్యార్థులు, రైతులను కలుపుకుని.. అరసవల్లి నుండి అమరావతి వరకు ‘‘రివర్స్ పాదయాత్ర’’ నిర్వహించాలని ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని సంఘలు ప్లాన్ చేస్తున్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర పూర్తి అయిన వెంటనే.. అధికార వైసీపీ మద్దతుతో ఈ యాత్రను పట్టాలెక్కించాలనే ఆలోచనలో వారు ఉన్నారు. 

ఇందుకోసం ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో మరికొద్ది వారాల్లోనే జేఏసీలు ఏర్పాటు కానున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడు రాజధానులకు మద్దతుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో సంతకాల సేకరణ, రౌండ్ టేబుల్ సమావేశాల్లు, వీధుల్లో ప్రచారాలు, నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ జేఏసీలు అన్నీ.. ఉత్తరాంధ్ర జేఏసీలో భాగం చేయనున్నారు. 

ఇటీవల నిర్వహించిన నాన్ పొలిటికల్ జేఏసీ సమావేశంలో అరసవల్లి నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేయాలని ప్రతిపాదించామని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్‌ శివశంకర్‌ చెప్పారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ఏ కార్యక్రమం చేపట్టిన తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర మంత్రులు, వైసీపీ ముఖ్య నాయకులు పలు సందర్బాల్లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలోనే జేఏసీ నిర్వహించాలని భావిస్తున్న రివర్స్ పాదయాత్ర‌లో వైసీపీ నేతలు కీలకంగా వ్యహరించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. 

click me!