ఏపీకి ప్రత్యేక హోదా లేదు: రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం

By narsimha lode  |  First Published Dec 12, 2022, 4:07 PM IST

ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఉండదని కేంద్ర ప్రభుత్వం  స్పష్టం చేసింది.ఈ విషయమై  కేంద్ర మంత్రి  ఇంద్రజిత్ సింగ్  ప్రకటించారు.


న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  ప్రత్యేక హోదా లేదని  కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ సహా ఇక ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఉండదని  కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారంనాడు  రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్  ఈ మేరకు  స్పష్టత ఇచ్చారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  ప్రత్యేక హోదా ఇస్తామని  పేర్కొన్నారు. కానీ  ప్రత్యేక హోదాను మాత్రం ఇవ్వలేదు.ఈ విషయమై ఏపీలో అధికారంలో ఉన్న పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదా లేదని తేల్చి చెబుతుంది.  ప్రత్యేక హోదా అనే అంశం ఉనికిలో కూడా లేదని  కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ చెప్పారు. వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల  దృష్ట్యా
గతంలో  ఎన్ డీసీ కొన్ని రాష్ట్రాలకు  ప్రత్యేక హోదా ఇచ్చిందని కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ గుర్తు చేశారు. 

14వ ఆర్ధిక సంఘం, కేటగిరి రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి ఎలాంటి వ్యత్యాసం చూపలేదన్న కేంద్రం స్పష్టం చేసింది. నిధుల పంపిణీ తర్వాత కూడా వనరుల లోటు ఉండే  రాష్ట్రాలకు  రెవిన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అందిస్తున్నామని కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్  వివరించారు.

Latest Videos

undefined

14వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకే కేంద్ర ప్రభుత్వం  రాష్ట్రాలకు పన్నుల వాటాను 32 నుండి  42 శాతానికి పెంచినట్టుగా  కేంద్ర మంత్రి తెలిపారు. 15 వ ఆర్ధిక సంఘం  కూడా  రాష్ట్రాలకు  పన్నుల వాటాను 41 శాతం ఇవ్వాలని సిఫారసు చేసిందన్నారు. అన్ని రాష్ట్రాలకు వీలైనన్ని నిధులు అందించేలా  చర్యలు తీసుకొంటున్నామని  కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

2019 ఎన్నికల ముందు  ఏపీ  రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశంపై  పార్టీలు విస్తృతంగా  ప్రచారం నిర్వహించారు. 2014 లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అప్పటి కేంద్ర ప్రభుత్వం  ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని తీసుకుంది. ప్రత్యేక హోదాకు సమానమైన ప్రత్యేక ప్యాకేజీని  చంద్రబాబు సర్కార్ తీసుకుంది.ఈ విషయమై అప్పట్లో చంద్రబాబు సర్కార్ పై వైసీపీ సహా ఇతర పార్టీలు తీవ్రమైన విమర్శలు చేశారు.  ప్రత్యేక హోదాతోనే ఏపీ రాష్ట్రం అభివృద్ది చెందుతుందని విపక్షాలు అభిప్రాయపడ్డాయి.  తమ పార్టీకి 25 మంది ఎంపీలను గెలిపిస్తే  ఏపీకి  ప్రత్యేక హోదాను తెచ్చేందుకు ప్రయత్నిస్తామని 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ ప్రకటించారు.  అయితే  అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రత్యేకహోదా అంశం  ముందుకు సాగలేదు.  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది.  ప్రాంతీయ పార్టీలపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉండే పరిస్థితులు ఉంటే  ప్రత్యేక హోదా అంశం  సాధ్యమయ్యేదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే  ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా,  నిర్మలా సీతారామన్ లను కలిసిన సమయంలో ప్రత్యేక హోదా విషయమై తాము చర్చిస్తున్నామని వైసీపీకి చెందిన  నేతలు, మంత్రులు  చెబుతున్నారు.
 

click me!