
ఏపి ఉద్యోగులు అర్జంట్ గా ‘వాయిదా పద్దతుంది దేనికైనా’ అని పాడుకుంటున్నారు. నవంబర్ నెల జీతాన్ని బ్యాంకుల్లో జమ చేస్తామని సిఎం చంద్రబాబు నాయడు చెప్పారు. పైగా జీతం డబ్బులను విడతల వారిగా తీసుకోవాలని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారులేండి.
వాయిదా పద్దతిలో ఇల్లు గడపుకోమని చెప్పటం వరకూ సులువే. అనుభవించేవారికే తెలుస్తుంది సమస్యలేమిటో. మొదటి వారం వచ్చేటప్పటికి పాలబిల్లు, కరెంటుబిల్లు, వెచ్చాలు, పనిమనిషి, పిల్లల ఖర్చులు, బండికి పెట్రోలు, మొబైల్ బిల్లులు, ఇంటి అద్దె ఇలా ఎన్నుంటాయో ఖర్చులు.
మరి వాటిల్లో చాలా వరకూ నగదుతోనే లావాదేవీలు జరుగుతుంటాయి. లావాదేవీలు జరపాలంటే చేతిలో డబ్బుండాల్సిందే. పైగా ఏపి ఉద్యోగులు పలువురికి రెండు సంసారాలు. అదేలెండి, ఒకరు విజయవాడలో మరొకరు హైదరాబాద్లో. దాంతో వారి ఖర్చులు తడిసి మోపెడవుతోంది. పై ఖర్చుల్లో వేటినీ ఆపేందుకు లేదు. ఏవో కొన్ని ఖర్చులను మాత్రం ఆన్ లైన్లో చేయగలరు కానీ అన్నీ చేయలేరు కదా. మరి వాటికి డబ్బు ఎవరిస్తారు?
ఇపుడదే సమస్య ఉద్యోగులను పట్టి పీడిస్తోంది. బ్యాంకులేమో సరిపడా డబ్బులివ్వదు. చేతిలో డబ్బు లేదు. మరి ఏ ఖర్చులను వాయిదా వేయాలి. అన్నీ నిత్యావసరాలే. దాంతో ఉద్యోగులకు దిక్కు తోచటం లేదు. సిఎం ఏమో చల్లగా ‘జీతాలను విడతల వారీగా తీసుకో’మని చెప్పారు.
పైగా సిఎం మరికొన్ని విషయాలను కూడా చెప్పారండోయ్. డబ్బులేనిదే ఎవరికీ ఏ పనీ కాదట. హుద్ హుద్ ను ఎదుర్కొన్నాం, గోదావరి పుష్కరాలను నిర్వహించాం, రాయలసీమ కరువును పారదోలినపుడు కరెన్సీ సంక్షోభాన్ని ఎదుర్కోలేమా అని అన్నారు. రాష్ట్రప్రభుత్వ ఆదాయాలు పడిపోయాట. బ్యాంకుల్లో రూ. 1252 కోట్లే ఉన్నాయట. అయినా డబ్బుకు ఇబ్బంది లేదట.
తన జీవితంలో ఇంతటి సంక్షోభాన్ని చూడలేదన్నారు. తాను పరిపాలనను పక్కన బెట్టి మరీ రోజుకు 6గంటలు ఇదే పనిమీద ఉన్నారట. సిఎం కమిటీ గురించిన స్పష్టత తనకు లేదని చెప్పారు. అయితే, జైట్లీ మాట్లాడటం వాస్తవమేనట. చివరగా అవసరాల మేరకు నగదును పంపమని ఆర్బిఐని కోరామని చంద్రబాబు పేర్కొనటం గమనార్హం.