టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని ఎమ్మెల్సీ, బీజేపీ నేత మాధవ్ తేల్చి చెప్పారు.
విజయవాడ: టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని ఎమ్మెల్సీ, బీజేపీ నేత మాధవ్ తేల్చి చెప్పారు. ఆదివారం నాడు విజయవాడలో బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదన్నారు.
రైతుల సమస్యలు, ప్రజలపై పన్నుల భారంపై ఉద్యమించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు. కరోనా కష్టకాలంలో పన్నులతో ప్రజలపై భారం వేయడం అన్యాయమన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీతో కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ కలిసి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో బీజేపీకి 5 ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాలు దక్కాయి. 2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఏపీ అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రాతినిథ్యం దక్కలేదు. ఈ ఎన్నికల తర్వాత జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకొంది.