ఏపీలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు: తేల్చేసిన కీలక నేత

By narsimha lodeFirst Published Jan 14, 2019, 8:14 PM IST
Highlights

త్వరలో ఏపీలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనుంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే ఊహగానాలకు చెక్ పడింది. 

విజయవాడ: త్వరలో ఏపీలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనుంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే ఊహగానాలకు చెక్ పడింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తును కూడ టీడీపీ కూడ ఆసక్తిగా లేదని  సమాచారం.  ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో వేర్వేరుగా పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దేశంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రక్రియలో  భాగంగా ప్రాంతీయ పార్టీలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ఈ పార్టీలన్నీ బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ను ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో పీపుల్స్ ఫ్రంట్‌ పేరుతో కూటమి ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ఈ కూటమి ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఇదిలా ఉంటే ఏపీలో కాంగ్రెస్  పార్టీతో పొత్తుతో లాభం కంటే నష్టమనే అభిప్రాయం టీడీపీలో ఉంది. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు కూడ టీడీపీతొ పొత్తును వ్యతిరేకిస్తున్నారు.

ఏపీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు రాజకీయంగా నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని టీడీపీలోని కొందరు అభిప్రాయంతో ఉన్నారు.  ఈ తరుణంలో  చంద్రబాబునాయుడు ఇటీవల కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని కలిశారు.

రాహుల్‌తో సమావేశం తర్వాత  కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని చంద్రబాబునాయుడు పార్టీ వర్గాలకు తేల్చి చెప్పారు. ఇదే రకమైన అభిప్రాయాన్ని కూడ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు కూడ సోమవారం నాడు తేల్చి చెప్పారు.

మాజీ రక్షణశాఖ మంత్రి పళ్లంరాజు  కూడ ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. పళ్లంరాజు కాంగ్రెస్  పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులు.   ఈ కారణంగానే  పళ్లంరాజు చేసిన ఈ ప్రకటనతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విషయమై స్పష్టత వచ్చిందని చెబుతున్నారు.


 

click me!