ఏపీలో మరో వారంరోజులు నైట్ కర్ఫ్యూ... జగన్ సర్కార్ కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Aug 15, 2021, 12:09 PM IST
Highlights

రాష్ట్రంలో రోజుకు వెయ్యికిపైగా కోవిడ్ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూనుమరో వారంరోజులు కొనసాగిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు ఎక్కువగానే నమోదవుతున్న నేపథ్యంలో మరో వారంరోజులు కర్ఫ్యూను పొడిగించింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రమంతటా ఈనెల 21 వరకు కర్ఫ్యూ యధావిధిగా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి పదిగంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. కోవిడ్‌-19 పరిస్థితులపై సమీక్షించిన అనంతరం సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఇక గత శుక్ర, శనివారాల మధ్య 24 గంటల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్‌‌‌లో కొత్తగా 1535 మందికి పాజిటివ్‌ కేసులు బయటపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,92,191కి చేరుకుంది. అలాగే తాజాగా ఈ మహమ్మారి వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,631కి చేరుకుంది.

read more  కొత్త లక్ష్యాలను నిర్ధేశించుకొనే సమయమిదీ: జాతీయ పతాకావిష్కరణ చేసిన జగన్

ఒక్కరోజు కరోనా నుంచి 2075 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,60,350కి చేరింది. 24 గంటల వ్యవధిలో 69,088 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,55,95,949కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 18,210 మంది చికిత్స పొందుతున్నారు. 

జిల్లాలవారిగా చూసుకుంటే అనంతపురం 31, చిత్తూరు 237, తూర్పుగోదావరి 299, గుంటూరు 173, కడప 39, కృష్ణ 109, కర్నూలు 8, నెల్లూరు 211, ప్రకాశం 107, శ్రీకాకుళం 54, విశాఖపట్నం 65, విజయనగరం 25, పశ్చిమ గోదావరిలలో 177 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

click me!