
విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయువ్యంగా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల పక్కన అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈశాన్య అరేబియా సముద్రంలో గుజరాత్ తీరాన మరో అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు. వీటి ప్రభావంతో దాదాపు దేశమంతటా వర్షాలు జోరందుకున్నాయని... రానున్న నాలుగు రోజులూ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
కోస్తాంధ్ర, తెలంగాణల్లో రానున్న 24గంటల్లో చెదురుమదురుగా వర్షాలతో పాటు కొన్నిచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నందున ఈ రెండు నదుల మీది ప్రాజెక్టులకు జలకళ మొదలు కానుంది. నిన్న(సోమవారం) తూర్పుగోదావరి జిల్లా తునిలో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నేడు(మంగళవారం) కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా వుండాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కనుక మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
read more మున్నేరు ఉద్ధృతి... నదీ మధ్యలో చిక్కుకున్న ఇసుక కూలీలు (వీడియో)
రేపు(బుధవారం) తెలంగాణలో అతి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. రానున్న మూడు రోజులూ కోస్తాంధ్ర, తెలంగాణల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని... ఈనెల 17వరకూ వర్షాల ఉద్ధృతి కొనసాగుతుందని అధికారుల అంచనా వేశారు.
ఇక నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశ రాజధానిని కరుణించాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించక వారం పాటు స్తబ్దుగా ఉన్న రుతుపవనాల్లో చలనం రావటంతో జమ్ము కశ్మిర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో దేశంలో వేసవితాపం పూర్తిగా తొలగినట్లయింది.