
తాడేపల్లి: వివాహమై కనీసం పదిరోజులు కూడా కాకముందే నవవరుడు కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఫస్ట్ నైట్ అంటే భయపడే తన కొడుకు ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాడని మృతుడి తల్లి వెల్లడించింది.
వివరాల్లోకి వెళితే... మాచర్ల పట్టణానికి చెందిన పత్తిగుడుపు విజయలక్ష్మి, సత్యనారాయణరాజు కుమారుడు కిరణ్ కుమార్ (32) కు తెనాలి సమీపంలోని వించిపేటకు చెందిన యువతితో ఈ నెల 11న పెళ్లయింది. వించిపేటలో వధువు తల్లిదండ్రులు ఘనంగా వివాహం చేసారు. 12వ తేదీన నూతన వధూవరులిద్దరు మాచర్లకు చేరుకున్నారు.
పెళ్లి తర్వాత కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత దంపతుల శోభనానికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 16న రాత్రి శోభనానికి అన్ని ఏర్పాట్లు చేసారు. వధువు ముందుగానే పుట్టింటికి చేరుకోగా కిరణ్ అదేరోజు మధ్యాహ్నం అత్తవారింటికి బయలుదేరారు. మధ్యాహ్నం నాలుగుగంటల సమయంలో గుంటూరు బస్టాండ్ లో దిగిన అతడు కనిపించకుండా పోయాడు.
అటు అత్తవారింటికి, ఇటు తమ ఇంటికి కూడా కొడుకు రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు అతడి ఫోన్ కు కాల్ చేయగా స్విఛ్చాప్ వచ్చింది. దీంతో బంధువులు, స్నేహితుల వద్దకు ఏమయినా వెళ్లాడేమోనని తెలిసినవారందరినీ ఆరా తీసారు. అయినా కిరణ్ ఆఛూకి లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు.
అయితే తాజాగా కృష్ణా నదిలో ఓ యువకుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభించింది. ఇది మిస్సయిన కిరణ్ ది అయివుంటుందని అనుమానించిన పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లి విజయలక్ష్మి అక్కడికి చేరుకుని మృతదేహం తమ కుమారుడిదేనని గుర్తించి బోరున విలపించింది.
పెళ్లి తర్వాత శోభనం అంటే కిరణ్ భయపడిపోయాడని... దీంతో అతడి స్నేహితులు ధైర్యం చెప్పారని తల్లి తెలిపింది. ఇదే భయంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె అనుమానం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకుని ఆనందంగా జీవిస్తాడని భావిస్తే అదే పెళ్లి కొడుకు ప్రాణాలు తీసిందని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
కిరణ్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి తల్లి చెప్పినట్లు ఫస్ట్ నైట్ భయమే అతడి ఆత్మహత్యకు కారణమా లేక మరేదైనా కారణముందా అన్నది తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.
పెళ్లయిన వారం రోజులకే భర్తను కోల్పోయిన యువతి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఎన్నో ఆశలతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించి అవేవీ నెరవేరకుండానే కట్టుకున్నవాడు ఆత్మహత్య చేసుకోవడంతో చిన్నవయసులోనే ఒంటరిగా మారింది.