రుణాలు వసూలు కాక ఆత్మహత్య చేసుకున్న బ్యాంక్ మేనేజర్ కేసులో ట్విస్ట్.. బ్యాలెన్స్ షీట్ లో తగ్గిన నగదు..!

By SumaBala BukkaFirst Published Oct 13, 2022, 12:13 PM IST
Highlights

ఇచ్చిన రుణాలు వసూలు కాక ఆత్మహత్య చేసుకున్న బ్యాంక్ మేనేజర్ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. 
 

యానాం : యూకో బ్యాంక్ మేనేజర్ విస్సా ప్రగడ సాయిరత్న శ్రీకాంత్ (33) ఆత్మహత్య ఘటన నేపథ్యంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. బ్రాంచ్ లో బ్యాలెన్స్ షీట్ లో రూ.29 లక్షలు తక్కువగా ఉందని, ఆ సొమ్మును ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీకాంత్ అనధికారికంగా తీసుకున్నారని పేర్కొంటూ బుధవారం మధ్యాహ్నం యానాం పోలీస్స్టేషన్లో ఎస్ఐ బడుగు కనకారావుకు అసిస్టెంట్ మేనేజర్  కోమలి, క్యాషియర్ విమల జ్యోతి  ఫిర్యాదు చేశారు. మంగళవారం  తాము బ్రాంచ్ తెరిచేటప్పటికి కంప్యూటర్ నగదు తక్కువగా చూపించిందని పేర్కొన్నారు. ఆ కోణంలో బ్యాంకు ఉన్నతాధికారులు సైతం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. బ్రాంచ్ లో ఉన్న రికార్డుల తనిఖీ, ఆడిటింగ్ సైతం చేసినట్లు తెలిసింది.

మచిలీపట్నంలో రుణ గ్రహీతల అప్పులు తీర్చేందుకు..
మచిలీపట్నం బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ గా పని చేసేటప్పుడు ఇచ్చిన రుణాలను సంబంధిత  రుణగ్రహీతలు తీర్చకపోవడంతో తానే బ్యాంకు నిబంధనల ప్రకారం తీర్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పలువురి దగ్గర మేనేజర్ శ్రీకాంత్ అప్పులు చేసినట్టు,  వాటికి వడ్డీలు సైతం కడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యానాం బ్రాంచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

విషాదం : ఇచ్చిన రుణాలు వసూలు కాక బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య..

మా ఒత్తిడి లేదు.. : యానాం యూకో బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ పై రుణాల రికవరీ కోసం బ్యాంకు యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందన్న వార్తల్లో వాస్తవం లేదని, అవి పూర్తిగా నిరాధారమని ఆ బ్యాంకు హైదరాబాద్ జోనల్ మేనేజర్  బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకు మేనేజర్ మృతికి చింతిస్తున్నాం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ  బ్యాంకు లావాదేవీలకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా.. బ్యాంకు ద్వారా ఇచ్చిన రుణాలు రికవరీ కాకపోవడంతో.. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యాయి. దాంతో తానే అప్పులు చేసి ఖాతాదారుల రుణాలు చెల్లించిన ఓ బ్యాంకు మేనేజర్ మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యానాంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై కనకారావు కథనం ప్రకారం.. సాయి రత్న శ్రీకాంత్ (33) ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్.  భార్య, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఆయన భార్య గాయత్రి పిల్లలను స్కూలుకు తీసుకువెళ్ళింది. అప్పటివరకు వారితో గడిపిన శ్రీకాంత్..  భార్య, పిల్లలు వెళ్ళిపోగానే ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 

ఇంటికి తిరిగి వచ్చిన భార్య ఎన్నిసార్లు తలుపు కొట్టినా..  తలుపు తెరవక పోవడంతో కిటికీలోంచి చూడగా శ్రీకాంత్ ఉరికి వేలాడుతూ కనిపించారు. దీంతో తలుపులు పగలగొట్టి ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. శ్రీకాంత్ యానాంకు రాక ముందు మూడేళ్లపాటు మచిలీపట్నం బ్రాంచ్ లో మేనేజర్ గా పని చేశారు. ఆ సమయంలో ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేశారు.

అయితే, రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించకపోవడంతో బయట అప్పులు చేసి రూ.60 లక్షల వరకు శ్రీకాంతే చెల్లించాడు. తర్వాత యానాంకు బదిలీపై వచ్చారు. ఇక్కడ కూడా మరో రూ.37లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసిందని పోలీసు అధికారులు వివరించారు. విధి నిర్వహణలో తన భర్త మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉండేవారని భార్య గాయత్రి పోలీసులకు తెలిపారు. అప్పులు తీరి పోతాయి అని గత రాత్రి ఎంతో ఆనందంగా చెప్పారని, ఇంతలోనే ఇలా జరిగిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. 

click me!