
నంద్యాల ఉపఎన్నికతో చంద్రబాబునాయుడుకి తలనొప్పులు తప్పేట్లు లేదు. పార్టీ అభ్యర్ధిగా చంద్రబాబు ఇంకా ఎవరినీ ప్రకటించలేదు. అభ్యర్ధిని ప్రకటిస్తానంటూ అప్పట్లో హడావుడి చేసిన భూమా అఖిలప్రియ కూడా చప్పుడు చేయకుండా కూర్చుంది. తనకు టిక్కెట్టు ఇవ్వకపోతే పార్టీ మారిపోతానంటూ శిల్పా మోహన్ రెడ్డి చంద్రబాబును బ్లాక్ మైల్ చేస్తున్నారు ఇంకా. ఇంతలో భూమా బ్రహ్మానండరెడ్డి మాత్రం తానే టిడిపి అభ్యర్ధినంటూ నియోజకవర్గంలో ప్రచారం చేసేసుకుంటున్నారు. ఆ విషయంపైనే ఇపుడు పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఇంతకీ ఎవరీ బ్రహ్మానందరెడ్డి? అంటే, చనిపోయిన భూమా నాగిరెడ్డికి సోదరుడు భూమా వీరశేఖర్ రెడ్డి కొడుకు. వీర శేఖర్రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన భార్యకు పోటీ చేసే అవకాశం వచ్చిందట. అయితే భూమా నాగిరెడ్డి అడ్డుపడ్డారట. మహిళకు టిక్కెట్టు ఎందుకు తానే పోటీ చేస్తానంటూ పట్టుబట్టి టిక్కెట్టు సాధించుకున్నారు. దాంతో వీరశేఖర్ రెడ్డి భార్యో లేక ఇంకెవరైనా కుటుంబసభ్యులు పోటీ చేయాల్సిన సీటులో భూమా నాగిరెడ్డి పోటీ చేసారు, గెలిచారు. అప్పటి నుండి నంద్యాల నియోజకవర్గం భూమా నాగిరెడ్డి సొంతమైపోయింది.
సరే, ప్రస్తుతానికి వస్తే భూమా నాగిరెడ్డి హటాత్తుగా మరణించారు కదా? దాంతో రాజకీయ వారసత్వం కోసం గొడవలు మొదలయ్యాయి. న్యాయంగా తమకు దక్కాల్సిన సీటును భూమా నాగిరెడ్డి లాక్కుపోయారు కాబట్టి ఇపుడు పోటీ చేసే అవకాశం తమకే ఇవ్వాలంటూ భూమా వీరశేఖర్రెడ్డి కొడుకు భూమా బ్రహ్మాంనదరెడ్డి పట్టుబడుతున్నారు.
నంద్యాల నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం తమ కుటుంబానికే దక్కాలంటూ భూమా నాగిరెడ్డి కూతురు కమ్ ఆళ్ళగడ్డ ఎంఎల్ఏ కమ్ మంత్రి భూమా అఖిలప్రియ పట్టుబడుతున్నారు. అప్పట్లో భూమా నాగిరెడ్డి తమ కుటుంబంపై ప్రయోగించిన అస్త్రాన్నే ఇపుడు నాగిరెడ్డి కుటుంబంపై బ్రహ్మానందం కూడా ప్రయోగిస్తున్నారు.
వివాహమై బెంగుళూరులో స్ధిరపడిన భూమామనస్వినికి టిక్కెట్టు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే తనకే టిక్కెట్టు ఇవ్వాల్సిందేనంటున్నారు.
అనటమే కాదు నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలుపెట్టేసారు. భూమా నాగిరెడ్డికి వారసుడిని తానేనంటూ వివిధ గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఎంఎల్ఏగా ఉన్నపుడు భూమా నాగిరెడ్డి ప్రతిపాదించిన పలు అభివృద్ధి పనులు ఎంతవరకూ వచ్చాయో బ్రహ్మానందరెడ్డి ఆరా తీస్తున్నారు. ఆయన పర్యటనలో స్ధానిక నేతలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దాంతో పార్టీలో మొదలైన గందరగోళాన్ని చంద్రబాబు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి.