
అసెంబ్లీ భవనం ఇలా ప్రారంభమైందో లేదో వెంటనే ఆహ్వానాల లొల్లి మొదలైంది. ప్రతిపక్షం ప్రారంభోత్సవానికి రాలేదని సిఎం అంటుంటే, తమకు అసలు ఆహ్వనమే అందలేదని వైసీపీ నేతలంటున్నారు. రెండింటిలో ఏది వాస్తవమో కూడా అర్ధం కావటం లేదు. విషయమేమిటని విచారిస్తే కార్యక్రమం మొత్తాన్ని సిఆర్డిఏ ద్వారా నడిపించారని సమాచారం. అసలైతే ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ సచివాలయం నిర్వహించాలి. అసెంబ్లీ సచివాలయాన్ని పక్కకు బెట్టేసి సిఆర్డిఏతో ఎందుకు చేయించారో ఏలినవారే చెప్పాలి.
పైగా ఏ పార్టీకీ నేరుగా ఆహ్వానాలు పంపకుండానే ప్రతిపక్షాలు కూడా కార్యక్రమానికి హాజరయ్యుంటే బాగుండేదని చంద్రబాబునాయుడు అనటంలో అర్ధమేమిటి? సిఆర్డిఏ ఆహ్వానాలను ఎలక్ట్రానిక్ పద్దతిలో పంపినట్లు సమాచారం. అంటే, ఏ ఫోన్లో ఎస్ఎంఎస్ ఇచ్చో లేక ఈ మైల్ ద్వారానో పంపుంటారు. ప్రతిపక్షాల సంగతి దేవుడెరుగు మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీకి కూడా ఆహ్వానాన్ని అందించలేదు. భాజపా శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజును ఇన్ఛార్జ్ కార్యదర్శి సత్యనారాయణ మొబైల్ ఫోన్ ద్వారానే ఆహ్వానించారు.
భాజపాను ఆహ్వానించినట్లుగా వైసీపీకి ఫోన్లో కూడా మాట్లాడలేదట. ప్రోటోకాల్ ప్రకారం సిఎం తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ కే ప్రాధాన్యం. వైసీపీ, భాజపాల పరిస్ధితే ఈ విధంగా ఉంటే ఇక, కాంగ్రెస్, వామపక్షాల సంగతి అడగనే అక్కర్లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కార్యక్రమం ఏదైనా కానీ ఉద్దేశ్యపూర్వకంగానే ప్రతిపక్షాలను కించపరుస్తోందన్నది వాస్తవం. నూతన అసెంబ్లీ భవనం గురించి చంద్రబాబు, కోడెల ఇన్ని గొప్పలు చెప్పుకుంటున్నారు. వారిద్దరికీ బ్రహ్మాండమైన కార్యాలయాలు, టిడిఎల్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి వైఎస్ఆర్సిఎల్పీ కార్యాలయం ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పగలరా?