
డల్లాస్: డల్లాస్ వేదికగా జరుగుతున్న జనసేన ప్రవాసగర్జనలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ గురించి చర్చించారు. భగత్ సింగ్ మండే అగ్ని గోళం, జ్వలించే నిప్పుకణిక, రెపరెపలాడే విప్లవ పతాకం అంటూ అభివర్ణించారు.
భగత్ సింగ్ పేరు వింటేనే, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయని చెప్పుకొచ్చారు. అయితే అలాంటి వ్యక్తి 23 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకున్నారంటూ వ్యాఖ్యానించారు.
అంతేకాదు భగత్ సింగ్ చరిత్ర చదివితే 23 ఏళ్ల వయసులో ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారనే విషయం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను చదవాలని సూచించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకోలేదని, దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారిపై హింసాత్మక ఉద్యమం చేపట్టి వారి చేతిలో ఉరితీయబడ్డారని చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఉరికొయ్యను ముద్దాడిన స్వాతంత్ర్య సమరయోధుడు అంటూ గుర్తు చేస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ చంద్రశేఖర్ ఆజాద్ పేరుకు బదులు భగత్ సింగ్ పేరు పొరపాటుగా ప్రస్తవించారంటూ పవన్ అభిమానులు సర్ధిచెప్పుకున్నారు. బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టడంతో నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను అంటూ చిన్నప్పుడు చేసిన శపథం నిజం చేస్తూ ఆజాద్ తన తుపాకీతో కాల్చుకుని వీరమరణం పొందిన విషయం తెలిసిందే.
అయితే ఆజాద్ ఆత్మహత్య చేసుకున్నారు అది తుపాకీతో కాల్చుకుని కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఉరివేసుకుని చనిపోయారంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చజరుగుతోంది.