అక్ర‌మ మైనింగ్ అడ్డుక‌ట్ట‌కు ప్ర‌త్యేక ప్ర‌భుత్వ క‌మిటీ.. : మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి

By Mahesh RajamoniFirst Published Nov 26, 2022, 5:57 AM IST
Highlights

Nellore: నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌, భారీ లారీల ఖ‌నిజ రవాణా, రోడ్ల ధ్వంసం వంటి చ‌ర్య‌ల‌ను అడ్డుకునేందుకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమిస్తామని ఆంధ్ర‌ప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Agriculture Minister Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌, భారీ లారీల్లో ఖనిజ రవాణా, ధ్వంసమైన రోడ్లు ఇత‌ర ప్ర‌జా ఇబ్బందిక‌ర చ‌ర్య‌ల‌ను అడ్డుకునేందుకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమిస్తామని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన త‌ర్వాత మంత్రి కాకాణి  మాట్లాడుతూ.. లారీల ద్వారా అధిక లోడ్లు తీసుకెళ్తుండటంతో జిల్లాలో పలు రోడ్లు దెబ్బతిన్నాయని, జిల్లాలో అక్రమ మైనింగ్‌ను నియంత్రించడంతో పాటు ఇలాంటి కార్యకలాపాలను అరికట్టాలని మంత్రి అన్నారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి కనెక్షన్ల కోసం ప్రభుత్వం రూ.7,600 కోట్లు మంజూరు చేసిందనీ, రెండు రోజుల క్రితమే జీవో విడుదలైందని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి చెప్పారు. నెల్లూరుకు రూ.344 కోట్లు కేటాయించామనీ, పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులందరి అభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో అక్రమ మైనింగ్‌, లారీల ద్వారా భారీగా లోడ్‌లు తరలిస్తున్నారని వెంకటగిరి శాసనసభ్యుడు ఎ రామనారాయణ రెడ్డి లేవనెత్తారు.

జిల్లాలోని అన్ని రహదారులను ప్రాధాన్యతా ప్రాతిపదికన వెంటనే మరమ్మతులు చేయాలని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారులను ఆదేశించి ఇటీవల మొదటి దశ పనులు పూర్తి చేశారు. ఖరీఫ్ సీజన్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతుల నుంచి వరిధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారనీ, పాలనా యంత్రాంగం వాటిని లోపరహితంగా అమలు చేయాలని గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి, ఎం చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌ ప్రతాప్‌కుమార్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌ కూర్మనాథ్‌, ఎస్పీ సీహెచ్‌ విజయరావు, డీఆర్‌వో పి వెంకటనారాయణమ్మ పాల్గొన్నారు.

అంత‌కుముందు రోజు.. సర్వేపల్లి నియోజకవర్గంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రూ.70 కోట్లు, రోడ్లకు రూ.84 కోట్లు మంజూరు చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కే.గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రామదాసు కండ్రిక చెరువును గురువారం ఆయన సందర్శించి నీటి వనరులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ ట్యాంకు ద్వారా దాదాపు 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందనీ, రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తోందన్నారు. గ్రామస్తులు, ఇరిగేషన్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి మంత్రి చెరువును సందర్శించి అందులో పూర్తి సామర్థ్యంతో నీటి నిల్వలు ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చెరువును పూర్తి స్థాయిలో నింపిన మంత్రికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామనీ, ప్రస్తుతం రెండు పంటలకు, తాగునీటి అవసరాలకు సరిపడా నీరు అందుతున్నాయని గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ప్రధాన సమస్య కాల్వతో వచ్చిందని, ఇప్పుడు దాన్ని పరిష్కరించామన్నారు. మాజీ సర్పంచ్ షాజహాన్, సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ వీ శైమసుందర్ రెడ్డిల కృషి అభినందనీయమన్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని వైకాపా ప్ర‌భుత్వం రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్న‌ద‌ని మంత్రి తెలిపారు. 2016 ఏప్రిల్‌లో జిల్లా కోర్టులో జరిగిన చోరీపై ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్వాగతించారు.

click me!