బాయిలర్ వద్దు నాటుకోడి ముద్దు.. చుక్కలను తాకుతున్న దేశవాళీ కోడి మాంసం ధరం, కేజీ 600పైనే

By Siva KodatiFirst Published Sep 1, 2021, 2:52 PM IST
Highlights

తెలుగునాట నాటుకోడి మాంసం వినియోగం పెరగడంతో ప్రస్తుతం మార్కెట్లో వీటి ధర అమాంతం పెరిగింది. కేజీ లైవ్ కోడి రూ.600 పలుకుతుంది. ఇక చికెన్ అయితే రూ.700 పైమాటే.. డిమాండ్ పెరగడంతో నాటుకోళ్లు పెంచేవారి సంఖ్య కూడా పెరిగింది. 

బ్రాయిలర్, ఫారం కోళ్ల రాకతో కనుమరుగైన నాటుకోళ్ల పెంపకం రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఊపందుకుంటోంది. రోడ్డుపక్కన అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో ఇళ్లలోనే నాటుకోళ్లను అధికంగా పెంచేవారు. ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే నాటుకోడినే కోసేవారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పండుగలకు గ్రామదేవతల దగ్గర నాటుకోళ్లనే నైవేద్యంగా సమర్పించారు. ఎప్పుడైతే మార్కెట్లోకి బ్రాయిలర్ ఎంట్రీ ఇచ్చిందో నాటుకోళ్ల పెంపకం క్రమంగా తగ్గింది. గుడ్డు తక్కువ ధరకు రావడం, మాంసం కూడా మెత్తగా, రుచిగా ఉండటంతో మాంసాహార  ప్రియులు బ్రాయిలర్ వైపు మొగ్గు చూపారు. దీంతో నాటుకోళ్ల పెంపకం క్రమంగా తగ్గింది.

అయితే  బ్రాయిలర్ కోడి త్వరగా బరువు పెరిగేందుకు హార్మోన్లు ఇంజక్షన్లు ఇస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి హానిచేస్తాయని భావన ఇటీవలి కాలంలో ప్రజల్లో పెరిగింది. దీంతో తమకు దగ్గర్లో నాటుకోళ్లు లేకపోయినా, తెలిసిన వారితో తెప్పించుకుంటున్నారు. నాటుకోడి మాంసం వినియోగం పెరగడంతో ప్రస్తుతం మార్కెట్లో వీటి ధర అమాంతం పెరిగింది. కేజీ లైవ్ కోడి రూ.600 పలుకుతుంది. ఇక చికెన్ అయితే రూ.700 పైమాటే.. బోనాల సమయంలో పలు ప్రాంతాల్లో కిలో రూ.800 లకి కూడా అమ్మారు.

లేయర్ కోడిగుడ్డుతో పోల్చితే నాటు కోడి గుడ్డులో పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే ఈ గుడ్డు ధరకూడా అంతే రేంజ్ లో ఉంటుంది. ఒక నాటుకోడి గుడ్డు రూ.20 రూపాయలుగా ఉంది. డిమాండ్ పెరగడంతో నాటుకోళ్లు పెంచేవారి సంఖ్య కూడా తెలుగు నాట క్రమంగా పెరుగుతుంది. నాటుకోళ్ల పెంపకం చేపడుతున్న వారిలో యువతే అధికంగా ఉన్నారు. 

click me!