చంద్రబాబుకి షాక్.. ఏపీ ప్రభుత్వానికి రూ.100కోట్ల ఫైన్

By ramya NFirst Published Apr 5, 2019, 10:51 AM IST
Highlights

చంద్రబాబు ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఏపీ సర్కార్ కి జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) రూ.100కోట్ల జరిమానా విధించింది. 


చంద్రబాబు ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఏపీ సర్కార్ కి జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) రూ.100కోట్ల జరిమానా విధించింది. ముఖ్యమంత్రి నివాసం ఉన్న ప్రాంతంలోనే అడ్డగోలుగా సాగుతున్న ఇసుక తవ్వకాలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిక ఆధారంగా ట్రిబ్యునల్ ఈ విధంగా తీర్పు నిచ్చింది.

ఈ మేరకు ఎన్జీటీ చైర్మన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌కుమార్‌ గోయల్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వాటర్‌ మ్యాన్‌గా ప్రసిద్ధి గాంచిన తరుణ్‌ భారత్‌ సంఘ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు రాజేంద్రసింగ్, ప్రొఫెసర్‌ విక్రమ్‌సోనీ, అనుమోలు గాంధీ, సత్యనారాయణ బొలిశెట్టి గత ఏడాది అక్టోబర్‌లో రాసిన లేఖను పిటిషన్‌గా పరిగణిస్తూ ఎన్జీటీ ఈ కేసును విచారించింది. 

అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయిన ఇసుక మాఫియా ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉపనదుల్లో ఇసుకను తోడేస్తోందని, ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి అత్యంత సమీపంలో యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయని పిటిషనర్లు తమ లేఖలో పేర్కొన్నారు. తాము చేపట్టిన నదీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆ విధ్వంసాన్ని స్వయంగా చూసి దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు.

ఈ పిటిషన్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన ట్రిబ్యునల్.. ప్రభుత్వానికి షాకిచ్చేలా తీర్పు వెలువరించింది. కాగా.. దీనిపై ఇప్పటివరకు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.

click me!