అల్లరి చేస్తున్నారని తాళ్లతో కట్టేసిన టీచర్ ... బాలల హక్కుల కమిషన్ సీరియస్

By telugu teamFirst Published Nov 29, 2019, 8:52 AM IST
Highlights

చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పి వారి భవితవ్యాన్ని తీర్చి దిద్దాల్సిన చోట ఉపాధ్యాయుల అవగాహనా రాహిత్యం, కోపావేశాల వలన పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. 
 

అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ పరిధిలోని నూలుబండ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇద్దరు చిన్నారులు తరగతి గదిలో అల్లరి చేస్తున్నారని , పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి బెంచ్‌కు తాడుతో కట్టి బంధించడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ జి.హైమావతి ఆగ్రహం వెలిబుచ్చారు. 

చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పి వారి భవితవ్యాన్ని తీర్చి దిద్దాల్సిన చోట ఉపాధ్యాయుల అవగాహనా రాహిత్యం, కోపావేశాల వలన పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. 

జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమీషనర్‌తో మాట్లాడారు. ఎంక్వయిరీ జరిపించి బాలల హక్కుల ఉల్లంఘనలకు పాల్పడడమే కాకుండా చిన్నారుల పట్ల అమానుషంగా ప్రవర్తించడంపై  విచారణ జరిపించి తక్షణమే బాధ్యులపై క్రిమినల్ మరియు శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

పాఠశాలల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలని తెలిపారు. బాలల న్యాయ చట్టం సెక్షన్ 82 , ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం 2009  సెక్షన్ 17  ప్రకారం పాఠశాలల్లో శారీరిక, మానసిక దండన చట్టరీత్య నేరం అదేవిధంగా పైన జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి బాలలకు  రావలసిన నష్టపరిహారాన్ని అందేలా చూడాలని ఆదేశించారు. 

మన ఆంధ్ర రాష్ట్రాన్ని బాలల స్నేహపూర్వక రాష్ట్రంగా అందరూ పిల్లలు విద్యనభ్యసించేలా ముఖ్యమంత్రి జగన్‌  వివిధ వినూత్న పథకాలు ప్రవేశ పెట్టి  అమ్మఒడి , ఆనందవేదిక, నో బాగ్ డే, స్కాలర్షిప్స్ , కెజిబివిలలో 12 తరగతి వరకు విద్య ద్వారా 6 నుండి 18  సంవత్సరాలవరకు ఉన్న బాల బాలికలందరు  ఆనంద ఉత్సాహాల మధ్య నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించడానికి ప్రోత్సహిస్తున్నార‌ తెలిపారు. 

కానీ ఉపాధ్యాయులలో అవగాహనా లోపం కారణంగా అక్కడక్కడా జరుగుతున్న‌ ఇలాంటి సంఘటనలు చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. కమిషన్ ఈ కేసును సుమోటోగా తీసుకుంటుందని అన్నారు.
 

click me!