సరసమైన ధరలకు ఇళ్ల పట్టాలు.. మరో దందాకు జగన్ సిద్ధం: రఘురామ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 31, 2021, 3:43 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సరసమైన ధరలకు ఇళ్ల పట్టాల పేరుతో మరో పథకానికి ఏపీ ప్రభుత్వం సిద్ధపడుతోందని.. మరో భూ దందా కోసమే దీన్ని చేపడుతున్నారని ఆరోపించారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సరసమైన ధరలకు ఇళ్ల పట్టాల పేరుతో మరో పథకానికి ఏపీ ప్రభుత్వం సిద్ధపడుతోందని.. మరో భూ దందా కోసమే దీన్ని చేపడుతున్నారని ఆరోపించారు.

జిల్లా కేంద్రాల్లో లేఅవుట్‌లు అభివృద్ధి చేసి ఇస్తామనడంలో దందా కోణం కనిపిస్తోందని రఘురామ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు టూ వీలర్స్‌ ఇస్తామంటున్నారని.. పింఛన్లు ఇవ్వడానికి నిధులు లేకపోతే వీటికి ఎక్కడి నుంచి తెస్తారని రఘురామ ప్రశ్నించారు.   

పశువులకు అంబులెన్స్ అంటూ మరో పథకం పెట్టారని.. దాని కంటే పశువైద్యులకే టూ వీలర్స్‌ ఇచ్చి అక్కడికి పంపితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో వేసుకుంటున్నారని రఘురామ ఆక్షేపించారు.

సర్పంచ్‌ల అధికారాలను లాక్కొంటున్నారని ఆయన విమర్శించారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టిందని.. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో రమేశ్ కుమార్ ముందుకెళ్లారని రఘురామకృష్ణంరాజు ప్రశంసించారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డకు రఘురామ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.  

click me!