
దేశంలోని ప్రతిష్టాత్మక పార్లమెంట్ నియోజకవర్గాల్లో పల్నాడు జిల్లాలోని నరసరావుపేట కూడా ఒకటి. ఇక్కడి నుంచి పోటీ చేసిన నేతలు ముఖ్యమంత్రులుగా , కేంద్ర మంత్రులుగా పనిచేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంగా, కేంద్ర హోంమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, కొణిజేటి రోశయ్యలు కూడా ముఖ్యమంత్రులుగా సేవలందించారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా బలమైన నేతలు ఎప్పుడూ అందుబాటులో వుండటంతో నరసరావుపేట వార్తల్లో వుంటోంది. పౌరుషాల పురిటి గడ్డ.. ఫ్యాక్షన్ చరిత్ర కలగలిసిన రాజకీయం ఇక్కడ నడుస్తోంది.
నరసరావుపేట ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. వైసీపీ - టీడీపీ పోటా పోటీ :
నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట , సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు వున్నాయి. ఈ ఏడు సెగ్మెంట్లలో కొన్ని టీడీపీకి కంచుకోటగా వుంటే.. ఇంకొన్ని వైసీపీకి బలమైన స్థానాలు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఈ ఏడు అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి లావు శ్రీకృష్ణదేవరాయులకు 7,45,089 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి రాయపాటి సాంబశివరావుకు 5,91,111 ఓట్లు.. జనసేన అభ్యర్ధికి 51,008 ఓట్లు పోలయ్యాయి . దీంతో వైసీపీ అభ్యర్ధి 1,53,978 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నరసరావుపేట లోక్‌సభ పరిధిలో మొత్తం ఓటర్లు 17,06,119 మంది. పురుష ఓటర్లు 8,75,813 మంది .. మహిళా ఓటర్లు 8,30,093 మంది. కమ్మ, రెడ్డి, యాదవ, దళిత, మైనార్టీ ఓటర్లు ఇక్కడ అభ్యర్ధుల భవితవ్యాన్ని నిర్దేశిస్తున్నారు.
నరసరావుపేట (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో వుండేదెవరు :
2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నరసరావుపేటలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరోసారి పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే ఈసారి టికెట్ ఇచ్చేది లేదని వైసీపీ హైకమాండ్ నుంచి సంకేతాలు అందడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. లావు పార్టీ మారడంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ బరిలో దింపారు సీఎం వైఎస్ జగన్. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సీఎం జగన్‌ను చూసి తనను గెలిపిస్తారని అనిల్ కుమార్ ధీమాగా వున్నారు.
తెలుగుదేశం విషయానికి వస్తే.. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు వయోభారంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన కుటుంబం నుంచి ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని రాయపాటి వర్గీయులు కోరుతున్నారు. నరసరావుపేట కుదరని పక్షంలో గుంటూరు పార్లమెంట్ టికెట్ కేటాయించాలని వారు ఆశపడుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన లావు శ్రీకృష్ణదేవరాయులు నరసరావుపేట టికెట్ ఇచ్చే హామీపైనే పార్టీ మారినట్లుగా వార్తలు వస్తున్నాయి. జనసేన పొత్తులో ఉన్నప్పటికీ .. ఆ పార్టీ నరసరావుపేట లోక్‌సభ స్థానాన్ని ఆశించే అవకాశాలు లేవు. రేపు బీజేపీ ఈ కూటమిలో చేరినా ఆ పార్టీ కూడా నరసరావుపేటపై ఆశలు పెట్టుకోదని విశ్లేషకులు అంటున్నారు.