నర్సాపురం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

Siva Kodati |  
Published : Mar 06, 2024, 05:03 PM ISTUpdated : Mar 07, 2024, 05:04 PM IST
నర్సాపురం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు వుంటే.. 24 చోట్ల రాజకీయం ఒక ఎత్తయితే, నరసాపురం పార్లమెంట్‌లో మరో ఎత్తు. సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వల్లే నరసాపురానికి అంతటి క్రేజ్ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  రాజుల ఖిల్లాగా.. రాజకీయం తెలిసిన జిల్లాగా నర్సాపురానికి పేరు. నర్సాపురంలో ఏళ్లుగా గెలుస్తూ వస్తున్న కాపులు, క్షత్రియులను పక్కనపెట్టి.. బీసీల్లో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన ఉమాబాలను వైసీపీ నిలబెట్టింది.

నర్సాపురం.. ఉభయ గోదావరి జిల్లాలోని కీలక లోక్‌సభ నియోజకవర్గం. సారవంతమైన భూములు, విశాల సముద్ర తీరం వున్న ఈ స్థానం పూర్తిగా డెల్టా పరిధిలో వుంటుంది. రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు వుంటే.. 24 చోట్ల రాజకీయం ఒక ఎత్తయితే, నరసాపురం పార్లమెంట్‌లో మరో ఎత్తు. సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వల్లే నరసాపురానికి అంతటి క్రేజ్ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాపు, క్షత్రియ సామాజికవర్గాలు తప్పించి మూడో వ్యక్తికి నర్సాపురం లోక్‌సభలో గెలిచిన చరిత్ర లేదు. రాజుల ఖిల్లాగా.. రాజకీయం తెలిసిన జిల్లాగా నర్సాపురానికి పేరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడింది ఇక్కడే.. నాగబాబును పరాజయం పలకరించింది ఇక్కడే.. టీడీపీ పట్టు కోల్పోయింది ఇక్కడే. 

నర్సాపురం ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. రాజుల ఖిల్లా : 

నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2019 నాటికి ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 14,38,922 మంది. వీరిలో ఎస్సీ ఓటర్లు 2,33,105 మంది.. ఎస్టీ ఓటర్లు 12,950 మంది.. గ్రామీణ ప్రాంత ఓటర్లు 10,54,730 మంది.. పట్టణ ప్రాంత ఓటర్లు 3,84,192 మంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు స్థానాల్లో ఆరింటిని వైసీపీ గెలుచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజుకు 4,47,594 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి వెటుకూరి వెంకట శివరామరాజుకు 4,15,685 ఓట్లు.. జనసేన అభ్యర్ధి నాగబాబుకు 2,50,289 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 31,909 ఓట్ల మెజారిటీతో నర్సాపురాన్ని కైవసం చేసుకుంది. 

నర్సాపురం (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. రఘురామపైనే వైసీపీ గురి :

2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన వెంటనే సీఎం జగన్, వైసీపీపై తిరుగుబాటు చేశారు రఘురామకృష్ణంరాజు.. నిత్యం పార్టీపై, ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేసేవారు రఘురామ. ఆయన ఈసారి కూడా నర్సాపురం నుంచి పోటీ చేయడం ఖాయమే. అది ఏ పార్టీ అనేది మాత్రం సస్పెన్స్. రఘురామను ఓడించాలని గట్టి పట్టుదలతో వున్న జగన్.. సామాజిక, ఆర్ధిక కోణాలను పరిశీలించి న్యాయవాది గూడూరి ఉమాబాలను వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించారు.

నర్సాపురంలో ఏళ్లుగా గెలుస్తూ వస్తున్న కాపులు, క్షత్రియులను పక్కనపెట్టి.. బీసీల్లో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన ఉమాబాలను వైసీపీ నిలబెట్టింది. ఈమె భీమవరానికి చెందినవారు. ఉమాబాల కుటుంబానికి రాజకీయ నేపథ్యం వుంది. అయితే ఉమాబాల ఎంపికపై వైసీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేండ్ర వెంకటస్వామి, కామన నాగేశ్వరరావు, వాసర్ల ముత్యాలరావు తదితరులు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 

టీడీపీ విషయానికి వస్తే.. రఘురామ కనుక పార్టీలో చేరితే ఆయనే అభ్యర్ధి. జనసేనతో పొత్తు వున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ స్థానాన్ని కోరే అవకాశం లేకపోలేదు. ఈ నియోజవకర్గంలో బీజేపీకి సైతం బలం వుంది. గతంలో కమలం తరపున దివంగత సినీనటుడు కృష్ణంరాజు, గోకరాజు గంగరాజులు విజయం సాధించారు. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిస్తే.. ఆ పార్టీ నర్సాపురాన్ని ఖచ్చితంగా కోరుతుందని విశ్లేషకుల అంచనా. ఒకవేళ ఒంటరిగా బరిలోకి దిగాల్సి వస్తే.. కృష్ణంరాజు కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా పోటీలో దించితే ఎలా వుంటుందనే చర్చ కూడా నడుస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!