
బెజవాడను ఆనుకోని వుండే ఏలూరులో రాజకీయాలు ఎప్పుడూ ఉత్కంఠగానే వుంటాయి. హేమాహేమీలను దేశానికి అందించిన ఈ నియోజకవర్గంలో పలువురు ప్రముఖులు ప్రాతినిథ్యం వహించారు. ఆంధ్రా జేమ్స్ బాండ్, డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్‌స్టార్ కృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. గతంలో ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలిచిన వారు కేంద్రంలోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు.
అలాంటి ఏలూరు నుంచి బరిలో దిగేందుకు అన్ని పార్టీల్లోనూ ఆశావహులు ఎప్పుడూ సిద్ధంగానే వుంటారు. దీనికి తోడు ఇక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుందో, ఆ పార్టీ గెలుస్తోందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ బలంగా వుంది. 1952 నుంచి 2019 వరకు ఇక్కడ 17 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ 5 సార్లు, సీపీఐ 3 సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి.
ఏలూరు ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. 9 సార్లు గెలిచిన కాంగ్రెస్ :
ఏలూరు లోక్‌సభ పరిధిలో మొత్తం ఓటర్లు 15,94,950 మంది. వీరిలో పురుష ఓటర్లు 8,09,236 మంది.. మహిళా ఓటర్లు 7,85,582 మంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ 13,27,923 మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. 83.26 శాతం పోలింగ్ నమోదైంది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏలూరులో జగన్ పార్టీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్ధి కోటగిరి శ్రీధర్‌కు 6,76,809 ఓట్లు, టీడీపీ అభ్యర్ధి మాగంటి బాబుకు 5,10,884 ఓట్లు, జనసేన అభ్యర్ధి పెంటపల్లి పుల్లారావుకు 76,827 ఓట్లు పోలయ్యాయి. దీంతో వైసీపీకి 1,65,925 ఓట్ల భారీ మెజారిటీ లభించింది.
ఏలూరు ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో ఎవరుండొచ్చు :
ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ తాను పోటీ చేయనని ముందే చెప్పడంతో జగన్ ఈ స్థానాన్ని బీసీలకు కేటాయించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్‌ను రంగంలోకి దించారు. యాదవ వర్గానికి ఈ నియోజకవర్గంలో వున్న పట్టును దృష్టిలో వుంచుకునే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏలూరులో యాదవ వర్గానికి 1.60 లక్షల ఓటింగ్ వుంది. ఇక టీడీపీ విషయానికి వస్తే.. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఏలూరును కమ్మ సామాజికవర్గానికే కేటాయిస్తూ వస్తోంది.
గత ఎన్నికల్లో ఓటమి పాలైన మాగంటి బాబు తాను మరోసారి పోటీ చేస్తానని చెబుతున్నారు. అయితే వైసీపీ బీసీ అస్త్రాన్ని ప్రయోగించడంతో చంద్రబాబు కూడా వ్యూహం మార్చారు. చింతలపూడి నియోజకవర్గానికి చెందిన గోరుముచ్చ గోపాల్ యాదవ్‌ను బరిలోకి దించాలని ఆయన భావిస్తున్నారు. రెండు పార్టీలు కనుక యాదవ నేతను బరిలోకి దించితే.. ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి తొలిసారి యాదవ నేత పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు.
అయితే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు టీడీపీ నేతలే కాదు.. జనసైనికులు సైతం ఉత్సాహంగా వున్నారు. కాపు సామాజికవర్గం ఇక్కడ బలంగా వుంది. వీరు పవన్‌పై ఒత్తిడి తెచ్చి ఏలూరును దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ జనసేన కూటమితో పొత్తు వున్నా, లేకున్నా బీజేపీ ఏలూరుపై కన్నేసింది. ఇక్కడి నుంచి గారపాటి వీరాంజనేయులు బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది.