Nara Lokesh: సత్యవేడు టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఏపీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మనందరం సైనికులకు మద్దతు ఉండాలనీ, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని అన్నారు. అలాగే, మనవద్ద నమో (నరేంద్ర మోడీ) మిసైల్ ఉందంటూ వ్యాఖ్యానించారు.
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సత్యవేడులో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయాన్ని కొనియాడిన లోకేష్, భారత సైనికులు పాకిస్థాన్‌పై స్ట్రయిక్స్ చేస్తూ "ఆపరేషన్ సింధూర్" పేరిట ఉగ్రవాదులపై పోరాటం చేస్తుండగా, ప్రతి ఒక్కరూ సైన్యానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
"మనందరం ముందుగా భారతీయులం. సరిహద్దుల్లో మన కోసం పోరాడుతున్న సైనికుల పట్ల సంఘీభావం వ్యక్తం చేద్దాం. వారికి మద్దతుగా నిలబడదాం" అని లోకేష్ తెలిపారు. అలాగే, తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను గుర్తుచేసిన ఆయన, సీనియర్లు, జూనియర్లను సమానంగా గౌరవిస్తూ పనిచేసే వారికి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. "ఇప్పటి నాయకత్వం మీ ముందుకు వచ్చిందంటే, ఇది టీడీపీ కార్యకర్తలకు ఇచ్చే గౌరవం" అని అన్నారు.
"ఇకపై పార్టీ లేదా నామినేటెడ్ పదవులు పొందాలంటే తప్పనిసరిగా కెఎస్ఎస్ బాధ్యతల్ని నిర్వర్తించాలి" అని నారా లోకేష్ వెల్లడించారు. పార్టీకి నిబద్ధతతో పనిచేసే వారినే గుర్తించి, పదవులు కల్పించాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
నిమ్మకాయల చినరాజప్ప, అనిత, కలిశెట్టి అప్పలనాయుడు, కాల్వ శ్రీనివాసుల వంటివారిని సాధారణ కార్యకర్తల నుంచి ముఖ్య పదవుల వరకూ తీసుకురావడం టీడీపీ గౌరవాన్ని చూపిస్తోందన్నారు. "కష్టపడి పనిచేసినవారికి మాత్రమే పదవులు ఇవ్వాలి" అన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని చెప్పారు.
అలాగే, పార్టీలో అలకల గురించి మాట్లాడుతూ "ఇది మన పార్టీ. సమస్యలు ఉన్నా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. నిర్ణయాలు కొంత సమయం పడవచ్చు కానీ, కార్యకర్తల మనోభీష్టానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోమని" నారా లోకేష్ అన్నారు.
రెడ్ బుక్ అమలుపై ఎవరికీ సందేహాలు అవసరం లేదని స్పష్టం చేసిన లోకేష్.. "మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తాం. మహానాడు తర్వాత ప్రతి కార్యకర్తను చురుకుగా పనిచేయించేందుకు కట్టుబడి ఉన్నాం" అన్నారు.
"వైసీపీ లాగా అహంకారంతో కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి సారించాలి. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దొంగపేపర్, టీవీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి" అని కార్యకర్తలకు సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లోకేష్ 14వ తేదీన జరిగే టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు, ఇందులో కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారని చెప్పారు.