గల్లీ నుండి డిల్లీ స్థాయిలో కుట్రలు... అయినా అంతిమ విజయం రైతులదే: నారా లోకేష్

By Arun Kumar PFirst Published Aug 8, 2021, 12:52 PM IST
Highlights

అమరావతిని అంతం చేసేందుకు వైసిపి నేతలు కుట్రలు చేస్తున్నారని... అయినా అంతిమ విజయం రాజధాని రైతులు, మహిళలదే అని మాజీ మంత్రి  నారా లోకేష్ స్పష్టం చేశారు. 

అమరావతి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ సాగుతున్న ఉద్యమం 600వ రోజుకు చేరుకున్న అమరావతిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇవాళ(ఆదివారం) రాజధాని మహిళలు, రైతులు చేపట్టిన నిరసనలకు మాజీ మంత్రి, టిడపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మద్దతు తెలిపారు. పోలీసులు, ప్రభుత్వం ఎంత నిర్భంధం విధించినా అంతిమ విజయం రైతులకే దక్కుతుందన్నారు. 

''అమరావతిని అంతం చేసేందుకు వైసిపి నేతలు కుట్రలు చేస్తున్నారు. గల్లీ నుంచి దిల్లీ వరకూ చేసిన కుట్రలను రైతులు ఓర్పుతో ఛేదించారు. అమరావతి గొప్పతనం దేశమంతా తెలిసేలా రైతుల ఉద్యమం సాగుతోంది. అంతిమ విజయం రైతులను వరించబోతుంది'' అన్నారు నారా లోకేశ్‌.

ఇక తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు అమరావతి ఉద్యమానికి, రైతుల పోరాటానికి వుంటుందని ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.  రాష్ట్ర ప్రజల కలను జగన్‌ చెల్లాచెదురు చేశారని... భవిష్యత్‌ను అంధకారం చేస్తున్న జగన్‌పై ప్రజలు తిరగబడాలని సూచించారు. అమరావతిని ధ్వంసం చేయడానికి మనసెలా ఒప్పింది? అని ప్రశ్నించారు. రైతుల పోరాటంతో ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగడం ఖాయం అని అచ్చెన్న భరోసా ఇచ్చారు. 

ఇక అమరావతి రాజధాని గ్రామాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. అమరావతి కరకట్టపైనే వాహనదారులను పోలీసులు అడ్డుకుంటున్నారు. రాజధాని గ్రామాల నుంచి మంగళగిరి వైపు వచ్చే ప్రాంతాల్లో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. 

మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు వెళ్లేందుకు రాజధాని మహిళల యత్నించారు. అయితే మహిళలను ఉండవల్లిలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో పోలీసు వాహనం ముందు కూర్చుని మహిళల ఆందోళనకు దిగారు. 

read more  తుళ్లూరులో ఉద్రిక్తత... హైకోర్టు వైపు పరుగుతీసిన మహిళలు (వీడియో)

తుళ్లూరు రైతు శిబిరం వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. ముళ్లకంచెలు వేసి రైతుల బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులంతా బైక్ లను అడ్డుకునే పనిలో వుండగా ఒక్కసారగా దీక్షా శిబిరం నుంచి హైకోర్టు వైపు పరుగులు తీశారు మహిళలు.

కృష్ణా జిల్లా నందిగామ నుంచి తాడేపల్లికి బస్సులో వెళ్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్నట్లు గుర్తించిన పోలీసులు బస్సును అడ్డుకున్నారు.  సీతానగరం ప్రకాశం బ్యారేజ్ వద్దకు రాగానే మహిళలను అడ్డుకుని వెనక్కి పంపించారు పోలీసులు. 

అమరావతి రాజధాని గ్రామాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బయటివారిని అడ్డుకుంటున్నారు పోలీసులు. మీడియా ప్రతినిధులను కూడా అడ్డుకుంటున్నారు. కరకట్టపై మంతెన సత్యనారాయణ ఆశ్రమం వద్దే మీడియా ప్రతినిధుల అడ్డగించారు. విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే మార్గంలో అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ సహా కరకట్ట వెంట పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరకట్టపై 4 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భారీఎత్తున పోలీసులను మోహరించారు. స్థానికులను మాత్రమే కరకట్ట రోడ్డుపైకి అనుమతిస్తున్న పోలీసులు
 
 పోలీసు వలయంలో తుళ్లూరు, మంగళగిరి మండలాలు ఉన్నాయి. 13 మంది డీఎస్పీలు, 45 మంది సీఐలతో భద్రత ఏర్పాటుచేశారు. 91 మంది ఎస్సైలు, 18 వందల మంది పోలీసులతో భద్రత చర్యలు చేపట్టారు. గుంటూరు రేంజ్ ఐజీ త్రివిక్రమ వర్మ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అలాగే గుంటూరు గ్రామీణ ఎస్పీ, అర్బన్ ఎస్పీలు కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 


 
 

click me!