
అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, ఆయన పార్టీ, ఆయన సామాజికవర్గ నేతలు దళితులపై సాగిస్తున్న దమనకాండకి హద్దే లేకుండా పోతోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) ఆరోపించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని నందనూరు పంచాయతీ పెద్దకంటిపల్లి గ్రామానికి చెందిన చంద్రన్ అనే దళితుడిపై జరిగిన దాడిని లోకేష్ ఖండించారు.
''డిప్యూటీ సీఎం నారాయణస్వామి (narayana swamy) రైట్‌హ్యాండ్ ఈశ్వర్ రెడ్డి దళితుడు చంద్రన్ కాళ్లూ చేతులూ విరిచేయడం రాష్ట్రంలో దళితుల ప్రాణాలకు రక్షణలేదని మరోసారి స్పష్టమైంది. పదివేలు బాకీ చెల్లించలేదని చంద్రన్ ని తన మామిడితోటకి ఎత్తుకెళ్లిన ఈశ్వర్‌రెడ్డి కాళ్లూ చేతులూ విరగ్గొట్టించేయడం పైశాచికానికి పరాకాష్ట. బాధితులైన దళితులు స్టేషన్‌లో ఫిర్యాదుచేస్తే పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్...వైసీపీ ఆర్డర్‌లో ఉందని తేటతెల్లం చేస్తోంది'' అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
''జగన్ (ys jagan) భజనలో నిత్యమూ మునిగితేలే దళిత ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి... మీ దళితజాతికి ఇంత అన్యాయం జరుగుతుంటే స్పందించరేం? బీమ్లా నాయక్ సినిమాపై స్పందించే నారాయణస్వామి గారికి తన నియోజకవర్గంలో, తన దళితజాతిని చంపేస్తున్నా... పట్టించుకునే తీరికలేకపోవడం విచారకరం'' అని ఎద్దేవా చేసారు.
''ఏపీ రాజధాని (ap capital) కోసం శాంతియుతంగా దళిత రైతులు ఆందోళన చేస్తుంటే వారిపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి కోర్టులతో చీవాట్లు తిన్న పోలీసులు ఇప్పటికైనా మారండి. దళితుడైన చంద్రన్ ని దండించిన ఈశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి'' అని నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా పోలీసులకు సూచనలు చేసారు.
ఇదిలావుంటే గుంటూరు జిల్లాలో మహిళా విలేకరిని టార్గెట్ గా చేసుకుని ఆమె వాహనాన్ని తగలబెట్టి భయపెట్టడంపై లోకేష్ స్పందించారు. మీడియాపైనా దాడులకు తెగబడటం వైసీపీ నయా ఫ్యాక్షనిజమని లోకేష్ ఆరోపించారు.
''గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఈ సారి నరసరావుపేట నుండి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారని మహా న్యూస్ లో స్టోరీ వేశారనే అక్కసుతో పిడుగురాళ్ల మహాన్యూస్ ప్రతినిధి మల్లేశ్వరి వాహనం గుర్తు తెలియని వ్యక్తులతో వైసీపీ ఎమ్మెల్యే తగలబెట్టించడం, ఫోన్లు చేసి చంపుతామని బెదిరించడం దారుణం'' అని మండిపడ్డారు.
''మహాన్యూస్ ప్రతినిధి మల్లేశ్వరిపై దాడుల్ని ఖండిస్తున్నాను. ఆమెకి ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, ప్రభుత్వందే. బెదిరిస్తున్న వారిని పోలీసులు తక్షణమే అరెస్ట్ చేసి మల్లేశ్వరికి రక్షణ కల్పించాలి'' అంటూ విలేకరి వాహన దహనానికి సంబంధించిన వీడియోను జతచేస్తూ టిడిపి నేత నారా లోకేష్ ట్వీట్ చేసారు.