మామయ్య అక్కడి నుంచే, తాత ఇలాకాలో చేయలేను: నారా లోకేష్

First Published Jun 28, 2018, 10:48 AM IST
Highlights

నందమూరి బాలకృష్ణ మళ్లీ హిందూపురం నుంచే పోటీ చేస్తారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చెప్పారు.

అమరావతి: నందమూరి బాలకృష్ణ మళ్లీ హిందూపురం నుంచే పోటీ చేస్తారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చెప్పారు. తాను తాత ఎన్టీ రామారావు గ్రామం ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేయలేనని చెప్పారు. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లినా తాము వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు. 

కేంద్రం నిర్ణయాలతో తమకు సంబంధం లేదని, ప్రజలు తమకు ఐదేళ్లకు అధికారం ఇచ్చారని, ఐదేళ్లూ పూర్తి చేసుకున్న తర్వాతనే తాము ఎన్నికలకు వెళ్తామని వివరించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తామే విజయం సాధిస్తామని, ప్రజలు తమతోనే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

ఒకప్పుడు తాగునీటి సమస్య, కరెంటు కోతలతో వేసవిలో ఎన్నికలంటే అధికారంలోని పార్టీలు భయపడేవని, ఆ సమస్యలను తాము చాలావరకూ పరిష్కరించామని, అందుకే షెడ్యూల్‌ ప్రకారం మే నెలలో ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ పోటీ చేసేదీ పార్టీ నిర్ణయిస్తుందని, దాన్ని తాను పాటిస్తానని ఆయన చెప్పారు. తన తాత ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరు పామర్రు నియోజకవర్గంలో ఉందని, అది రిజర్వుడు నియోజకవర్గం కాబట్టి తాను పోటీ చేయలేనని అన్నారు. 

రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సింది ఏదడిగినా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపలేదని చెప్పడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఏ నివేదిక ఆధారంగా గుజరాత్‌ బుల్లెట్‌ రైలుకు నిధులిచ్చారని లోకేష్ ప్రశ్నించారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం కోరినవన్నీ ఇస్తామని చెప్పామని అన్నారు. ఇంకా మమ్మల్ని రాయితీలు అడగడం ఏమిటని అడిగారు. 

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రధాని మోడీని కలిసి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం విజ్ఞప్తి చేయడాన్ని ప్రస్తావించగా, కేరళ సీఎం సమయం కోరితే ప్రధాని ఇవ్వలేదని, కానీ కొందరికి మాత్రం వెంటనే సమయం దొరుకుతోందని వ్యాఖ్యానించారు.

click me!