
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు జగన్ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. అప్పుడు పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాలు లీకవడం... ఇప్పుడేమో పరీక్షా పలితాల్లో అతి తక్కువగా ఉత్తీర్ణతశాతం నమోదవడంపై ప్రభుత్వం తప్పిదంగానే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విద్యావ్యవస్థలో గొప్ప సంస్కరణలు తీసుకువస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న జగన్ సర్కార్ తాజాగా పదోతరగతి పలితాలపై ఏం సమాధానం చెబుతుందని టిడిపి ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముఖాముఖీ నిర్వహించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) వైసిసి సర్కార్ పై విరుచుకుపడ్డారు.
''జగన్ రెడ్డి (YS Jagan) రివర్స్ పాలనలో పదో తరగతి రిజల్ట్స్ (ap ssc results 2022) కూడా రివర్స్ గా వచ్చాయి. టెన్త్ క్లాస్ రిజల్ట్స్ చూసిన తరువాత షాక్ కి గురయ్యాను. కనీస అవగాహన లేని ప్రిజనరీ వ్యక్తి సీఎం అయితే ఎంత ప్రమాదమో చూస్తున్నాం. ప్రిజనరీ జగన్ రెడ్డికి పాలన చేతగాకే విద్యా వ్యవస్థను నాశనం చేసారు. అయినా టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసి పరీక్షలు రాసిన జగన్ రెడ్డికి విద్యార్థుల కష్టం ఏం తెలుస్తుంది'' అంటూ లోకేష్ ఎద్దేవా చేసారు.
''పదో తరగతి పరీక్షల నిర్వహణ నుండి రిజల్ట్స్ ప్రకటించే వరకూ అంతా గందరగోళమే. పరీక్షల సమయంలో కూడా కరెంట్ కోతలు పెట్టిన చెత్త ప్రభుత్వం ఇది. నిజానికి ఫెయిల్ అయ్యింది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కాదు... జగన్ సర్కార్ ఫెయిల్ అయ్యింది'' అన్నారు.
''2018లో టిడిపి ప్రభుత్వం చివరగా నిర్వహించిన టెన్త్ పరీక్షల్లో 94.48 శాతం పాస్ పర్సంటేజ్ వచ్చింది. నేడు జగన్ రెడ్డి పాలన లో 67.26 శాతం మాత్రమే వచ్చింది. టిడిపి హయాంలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నా గత 20 ఏళ్లలో ఇదే అతి తక్కువ పాస్ పర్సంటేజ్. రాష్ట్రంలోని 71 ప్రభుత్వ స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ కాకపోవడం మరీ దారుణం. రెండు లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడం ఏంటి అని అందరూ బాధపడుతుంటే జగన్ రెడ్డి మాత్రం హ్యాపీగా వేలకోట్లు అమ్మఒడి డబ్బులు మిగిలాయని సంబరాలు చేసుకుంటున్నారు'' అని లోకేష్ మండిపడ్డారు.
''నాడు- నేడు పేరుతో భారీగా అవినీతికి పాల్పడుతున్న ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించింది. నాడు- నేడులో స్కూళ్లు బాగుపడలేదు... వైసిపి నాయకులు మాత్రమే బాగుపడ్డారు. పిల్లల పేరు చెప్పి ఇప్పటికే రూ.3500 కోట్లు కొట్టేసారు. స్కూల్ భవనాల పైకప్పులు ఊడి పిల్లల తలలు పగులుతున్నాయంటే నాడు- నేడు పనులు ఎంత గొప్పగా చేసారో అర్ధం అవుతుంది'' అన్నారు.
''ఉపాధ్యాయులు దేవుడితో సమానం. అందరూ గురువుల్ని గౌరవిస్తాం. కానీ ప్రిజనరీ జగన్ రెడ్డి గురువులను ఘోరంగా అవమానించాడు. మద్యం షాపుల ముందు ఉపాధ్యాయులను కాపలా పెట్టిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. చదువు చెప్పాల్సిన టీచర్లను టార్చర్ చేసారు. మరుగు దొడ్ల ఫోటోలు, భోజనాల ఫోటోలు తీసి యాప్ లో అప్ లోడ్ చెయ్యాలంటున్నారు. ఇవి టీచర్ల పనేనా? టీచర్లు ఇవి చేస్తుంటే విద్యార్థులకు చదువు ఎవరు చెబుతారు?'' అని లోకేష్ నిలదీసారు.
''వారంలో సిపిఎస్ రద్దు చేస్తా, అదిరిపోయే పీఆర్సీ ఇస్తా అని హామీ ఇచ్చి ఉపాధ్యాయులను మోసం చేసారు. హక్కుల కోసం పోరాడిన ఉపాధ్యాయులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్ రెడ్డి చెత్త నిర్ణయాల వలన చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు రోడెక్కి పోరాటాలు చెయ్యాల్సిన దుస్థితి వచ్చింది'' అంటూ ఆందోళన వ్యక్తం చేసారు.
''ప్రతీయేటా మెగా డీఎస్సీలో టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. మూడేళ్లలో ఒక్క కొత్త టీచర్ ని కూడా నియమించలేదు. విద్యార్థులకి చదువు చెప్పే టీచర్లు లేకే ఇంత దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఎయిడెడ్ పాఠశాలల రద్దు, పరీక్ష పత్రాల తయారీ విధానంలో లోపాలతో 20 ఏళ్లలో ఎన్నడూ రాని దారుణ ఫలితాలు వచ్చాయి. దశల వారిగా చేపట్టాల్సిన సంస్కరణలు ఒక్క సారిగా తీసుకురావడం కూడా ఫెయిల్ పర్సంటేజ్ పెరగడానికి కారణం'' అన్నారు.
''అమ్మ ఒడి ఇవ్వడానికి నిధుల్లేక, అప్పులు దొరక్క ఇప్పటికే వాయిదాలు వేసుకుంటూ వచ్చిన ప్రభుత్వం లబ్ధిదారులను తగ్గించే కుట్రలు చేస్తోంది. అందులో భాగంగానే టెన్త్ ఫలితాల్లో అత్యధికుల్ని ఫెయిల్ చేసిందనే అనుమానాలున్నాయి. టెన్త్ అతి ఎక్కువ మంది పాసైతే అమ్మ ఒడితోపాటు ఇంటర్, పాలిటెక్నిక్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి కుట్రలుపన్ని అతి ఎక్కువమందని ఫెయిల్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా వివిధ కుట్రలతో ఒక్కో నియోజకవర్గంలో 10 వేల మందిని అమ్మ ఒడి నుండి తొలగిస్తున్నారు'' అని అన్నారు.
''టిడిపి ప్రభుత్వహయాంలో నిరంతర పర్యవేక్షణ , డీయస్సీల ద్వారా టీచర్ల కొరత తీర్చటం, వారికి ప్రమోషన్లు ఇవ్వటం, మెరుగైన పీఆర్సీ ఇవ్వటంవల్ల ఎంతో ఉత్సాహంగా పనిచేసారు. అందువల్లే టెన్త్ పరీక్షల్లో ప్రతి సారీ 90 శాతం పైనే ఫలితాలు సాధించడానికి కృషి చేసారు. కానీ జగన్ ప్రభుత్వం చేతకానితనం, మూర్ఖత్వం, విద్యార్థుల సంక్షేమ పథకాలు తగ్గించాలనే కుట్రకి లక్షలాది మంది విద్యార్థులు బలి అయ్యారు'' అని ఆరోపించారు.
''బెండపూడిలో పదేళ్లుగా ప్రసాద్ అనే టీచర్ ఎన్నారైల సహకారంతో విద్యార్థులను అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడేలా తీర్చిదిద్దితే ఆ ఘనత తన ఖాతాలో వేసుకున్నారు జగన్ రెడ్డి. మరి ఇప్పుడు 2 లక్షల మంది ఫెయిల్ అయితే అది మాత్రం జగన్ రెడ్డి ఖాతాలో వేసుకోరట. చెత్త ప్రభుత్వం, చేతగాని సీఎం వలన టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం .ఎవ్వరూ అధైర్య పడొద్దు పరీక్షల నిర్వహణ, రిజల్ట్స్ ప్రకటనలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా టిడిపి పోరాడుతుంది'' అన్నారు.
''రీవాల్యుయేషన్ కాదు రీ వెరిఫికేషన్ చేయాలి. రీ వెరిఫికేషన్, సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు రద్దు చెయ్యాలి. పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించాలి. సిఎం, విద్యా శాఖ మంత్రి సమీక్ష చేసి వెంటనే శ్వేత పత్రం విడుదల చెయ్యాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పాస్ పర్సంటేజ్ ఎంతో బయట పెట్టాలి. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి'' అని లోకేష్ డిమాండ్ చేసారు.