కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీకి సంబంధించి నారా లోకేష్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీకి సంబంధించి నారా లోకేష్ తాజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా కలవాలని అనుకుంటున్నట్టుగా టీ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారని లోకేష్ చెప్పారు. అమిత్ షాకు అన్ని విషయాలను వివరించానని తెలిపారు. తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా చెప్పానని అన్నారు. చంద్రబాబు భద్రతాపరంగా ఉన్న ఆందోళనను కూడా అమిత్ షాకు తెలియజేసినట్టుగా లోకేష్ చెప్పారు. సీఐడీ ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడినట్టుగా తెలిపారు. అవన్నీ పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసులేనని అమిత్ షాకు చెప్పినట్టుగా తెలిపారు.
బీజేపీ పేరు చెప్పి కక్ష సాధిస్తున్నారని అమిత్ షా అన్నట్టుగా లోకేష్ చెప్పారు. బీజేపీపై జగన్ నిందలు మోపుతున్నారని అమిత్ షా అన్నారని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ వెనక వారు లేరని అమిత్ షా స్పష్టంగా చెప్పారని అన్నారు. అమిత్ షా వద్ద ఎలాంటి రాజకీయ విషయాలు చర్చకు రాలేదని తెలిపారు. చంద్రబాబును బీజేపీనే ఇబ్బంది పెడుతుందని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని లోకేష్ చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో బీజేపీ పాత్ర ఉందని అనుకోవడం లేదని.. ఆ పార్టీ నేతలు మౌనంతోనే ఆరోపణలు వచ్చాయని అనుకుంటున్నట్టుగా చెప్పారు. నిజంతో ఉండాలని అమిత్ షాను కోరినట్టుగా లోకేష్ తెలిపారు. తాను చెప్పిన విషయాలను అమిత్ షా ఓపికగా విన్నారని.. చంద్రబాబు ఆరోగ్యంపై కూడా ఆరా తీశారని చెప్పారు.
రాష్ట్రం నుంచి అమిత్ షా సమాచారం తీసుకుంటున్నట్టుగా తమకు తెలిసిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని విమర్శించారు. చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారని.. ఈ విషయంలో వైసీపీ శ్రేణులకే అనుమానం ఉందని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు వెనక ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. తన తల్లి భువనేశ్వరి ఐటీ రిట్నర్స్ సీఐడీ చేతికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి సీబీడీటీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించి 17ఏ చాలా కీలక అంశమని.. దానిని పరిగణలోకి తీసుకుంటే చాలా మంది ఇబ్బంది పడతారని అన్నారు.
ఎన్డీఏ, ఇండియా కూటములకు తాము సమదూరంలో ఉన్నామని చెప్పారు. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను కలిశానని అన్నారు. త్వరలోనే యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తానని చెప్పారు.