అత్యంత ధనిక ఎమ్మెల్సీగా నారా లోకేష్... అతి పేద ఎమ్మెల్సీ ఎవరంటే..: ఏడిఏ సర్వే వెల్లడి

By Arun Kumar PFirst Published Aug 14, 2022, 11:32 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత ధనిక ఎమ్మెల్సీగా నారా లోకేష్ నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్, ఏపీ ఎలక్షన్ వాచ్ సంస్థలు చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు వెలువడ్డాయి. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత ధనిక ఎమ్మెల్సీగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ నిలిచారు. తాము చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్, ఏపీ ఎలక్షన్ వాచ్ సంస్ధలు ప్రకటించాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీల ఆస్తులు, విద్యార్హతలు, వారిపై వున్న క్రిమినల్ కేసులపై అధ్యయనం చేసారు. తాజాగా ఈ అధ్యయనానికి సంబంధించిన రిపోర్ట్ ను వెల్లడించారు.   

ఎన్నికల సమయంలో నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎమ్మెల్సీలు అందించిన వివరాల ఆధారంగా ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ సర్వే చేపట్టారు. ఇందులో 369 కోట్ల రూపాయల ఆస్తులతో అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్సీగా నారా లోకేష్ నిలిచారు. ఆస్తుల విషయంలో 101 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో వాకాటి నారాయణరెడ్డి, 36 కోట్ల రూపాయలతో మూడోస్థానంలో మాధవరావు నిలిచారు. ఇలా మొత్తం 36 మంది ఎమ్మెల్సీలు కోటీశ్వరులేనని... వీరిలో 22మంది అధికార వైసిపి, 11 మంది ప్రతిపక్ష టిడిపికి చెందినవారుగా సర్వేలో తేలినట్లు ప్రకటించారు. 

ఇక ఏపీలో అతి తక్కువ ఆస్తులు కలిగిన ఎమ్మెల్సీగా పి. రఘువర్మ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ కేవలం 1,84,527 రూపాయలుగా సర్వేలో తేలింది. ఆయన ఇండిపెండెంట్ గా శాసనమండలికి పోటీచేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. 

Read More  రోడ్లపై మనుషులు చనిపోతుంటే ప్రభుత్వం నిద్రపోతోందా?.. వైసీపీ సర్కార్‌పై చంద్రబాబు ఫైర్

ఇక అత్యధికమంది ఎమ్మెల్సీలు ఉన్నత విద్యార్హత కలిగినవారేనని ఈ సర్వే తేల్చింది. 40 మంది ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్, అంతకంటే ఎక్కువ చదువులు చదివితే కేవలం 8మంది ఇంటర్మీడియట్ కంటే తక్కువ విద్యార్హత కలిగివున్నారు. 

ఇక ఏపీకి చెందిన ఎమ్మెల్సీల క్రిమినల్ కేసులపైనా ఏడిఆర్, ఎలక్షన్ వాచ్ సర్వే చేసింది. ఇప్పుడున్న ఎమ్మెల్సీల్లో 20మందిపై వివిధ క్రిమినల్ కేసులు వున్నాయని తెలిపారు. అయితే కొందరు ఎమ్మెల్సీలకు సంబంధించిన వివరాలు దొరక్కపోవడంతో 58 మంది ఎమ్మెల్సీల్లో 48మందికి సంబంధించిన వివరాలను మాత్రమే వెల్లడించినట్లు ఏడిఆర్, ఏపీ ఎలక్షన్ వాచ్ సంస్థలు తెలిపాయి. 

  

click me!