సుప్రీం కోర్టుకే ఫేక్ అఫిడవిటా... చీవాట్లు తిన్నాకైనా మారండి..: జగన్ పై లోకేష్ సెటైర్లు

By Arun Kumar PFirst Published Jun 24, 2021, 1:15 PM IST
Highlights

పరీక్షల నిర్వహణకు సంబంధించి సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. 

అమరావతి: కరోనా సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు సిద్దమవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. 

''ఆఖరికి దేశ అత్యున్నత న్యాయస్థానానికి కూడా ఫేక్ అఫిడవిట్ సమర్పించి మరోసారి ఫేక్ సీఎం అనే పేరుని సార్ధకం చేసుకున్నారు జగన్ రెడ్డి. పరీక్షల నిర్వహణకు సరైన ప్రణాళిక లేని అఫిడవిట్ సమర్పించి చివాట్లు తిన్నారు'' అన్నారు. 

read more  పరీక్షలపై పక్కా సమాచారమేది... జగన్ సర్కార్ పై సుప్రీంకోర్ట్ అసంతృప్తి

''మీరు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం పరీక్షల నిర్వహణకు 35 వేల క్లాస్ రూమ్స్ ఉండాలి. అన్ని రూమ్స్,సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేసిందా?ప్రాణాల రక్షణకు, పరీక్షల నిర్వహణకు కనీస ఏర్పాట్లు కూడా చెయ్యకుండానే మొండి పట్టుదలతో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని సుప్రీం కోర్టు ప్రశ్నించడం జగన్ రెడ్డి మూర్ఖత్వానికి పరాకాష్ట'' అని విమర్శించారు. 

''పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే పోయే ఒక్కో ప్రాణానికి కోటి రూపాయిలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి అని కోర్టు వ్యాఖ్యానించడం చూస్తే ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదనే విషయం బయటపడింది. ఇప్పటికైనా చేసిన తప్పుని సరిదిద్దుకొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రాణాలు బలితీసుకునే పరీక్షల నిర్వహణ ఆలోచనకి స్వస్తి పలకాలి. తక్షణమే పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని సుప్రీం కోర్టుకి తెలపాలి'' అని లోకేష్ సూచించారు. 


 

click me!