ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ , ఏపీ ఫైబర్ నెట్ కేసులలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.
అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం నాడు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని లోకేష్ తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టును కోరారు. ఇవాళ మధ్యాహ్నం ఈ పిటిషన్లను విచారించనుంది ఏపీ హైకోర్టు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో లోకేష్ తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని కోరారు. ఇవాళ మధ్యాహ్నం 02:15 గంటలకు ఈ పిటిషన్ పై విచారించనుంది ఏపీ హైకోర్టు.ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబుపై పీటీ వారంట్ కోర్టులో పెండింగ్ లో ఉంది. లోకేష్ పేరును కూడ ఎఫ్ఐఆర్ లో చేర్చారనే సమాచారంతో లోకేష్ న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మరో వైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను ఏ 14గా సీఐడీ చేర్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది. లోకేష్ కు 41 ఏ సీఆర్‌పీసీ కింద నోటీసు ఇచ్చి విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్లారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ నెల 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ వరకు జ్యుడీషీయల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఈ కేసులో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చంద్రబాబు. ఈ ఏడాది అక్టోబర్ 3న సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించనుంది. చంద్రబాబుతో పాటు లోకేష్ పై కేసులు నమోదయ్యాయి.దీంతో లోకేష్ కూడ న్యాయస్థానాల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.