నేడు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ భేటీ: ఉమ్మడి కార్యాచరణపై చర్చ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ లు ఇవాళ సమావేశం కానున్నారు. ఉమ్మడి కార్యాచరణపై చర్చించనున్నారు.

Google News Follow Us

రాజమండ్రి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్  నాదెండ్ల మనోహర్ బుధవారంనాడు సాయంత్రం రాజమండ్రిలో సమావేశం కానున్నారు.  టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ ఏర్పాటుపై చర్చించనున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ప్రకటించారు. రానున్న రోజుల్లో రెండు పార్టీలు ఉమ్మడిగా కార్యాచరణ నిర్వహించే విషయమై  చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే   జనసేన, టీడీపీల మధ్య  సమన్వయం కోసం  కమిటీలను ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలపై  ఉమ్మడి కార్యాచరణతో పాటు  క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం తీసుకోవాల్సిన చర్యలపై  చర్చించనున్నారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  టీడీపీ చీఫ్ చంద్రబాబును  ఏపీ సీఐడీ ఈ ఏడాది సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసింది. ఈ కేసులో  అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు.2024 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో  వైఎస్ జగన్ ను  అధికారంలోకి రాకుండా అడ్డుకుంటానని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. ఈ మేరకు  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా విపక్షాలు కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉందని  పవన్ కళ్యాణ్ కోరిన విషయం తెలిసిందే. 

ఇవాళ ఉదయమే న్యూఢిల్లీ నుండి నారా లోకేష్ అమరావతికి చేరుకున్నారు.  అక్కడి నుండి రోడ్డు మార్గంలో రాజమండ్రికి వెళ్లారు.  ఇవాళ మధ్యాహ్నం రాజమండ్రి  జైలులో  చంద్రబాబుతో  లోకేష్, భువనేశ్వరి భేటీ కానున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత  లోకేష్, నాదెండ్ల మనోహర్ లు సమావేశం కానున్నారు.

2014లో జరిగిన ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో  టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులకు  జనసేన మద్దతు ప్రకటించింది. ఆ ఎన్నికల సమయంలో  ఈ రెండు పార్టీల అభ్యర్థులకు  మద్దతుగా  పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  మరో వైపు 2019 ఎన్నికలకు ముందు  టీడీపీతో  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెగదెంపులు చేసుకున్నాడు.   2019 ఎన్నికల్లో లెఫ్ట్,బీఎస్పీలతో కలిసి జనసేన పోటీ చేసింది.  ఈ ఎన్నికల్లో జనసేన ఒక్క అసెంబ్లీ స్థానంలో విజయం సాధించింది. ఈ ఎన్నికల తర్వాత  బీజేపీతో  పవన్ కళ్యాణ్ పొత్తును ప్రకటించారు.

 2024 ఎన్నికల్లో కూడ బీజేపీతో పొత్తు కొనసాగుతుందని  అప్పట్లో ఆయన  ప్రకటించిన విషయం తెలిసిందే.  బీజేపీతో మైత్రి ఉన్నప్పటికీ టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై వైసీపీ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే

Read more Articles on