
తిరుమల: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబ సమేతంగా రేపు (శనివారం) తిరుమలకు చేరుకోనున్నారు. 21వ తేదీ ఆదివారం మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారమే చంద్రబాబు కుటుంబం తిరుమలకు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రతిఏడాది లాగే ఈసారి కూడా అన్నదానం ట్రస్టుకు రూ.30లక్షలు విరాళంగా ఇవ్వనున్నారు.
నారా లోకేష్-బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్ ప్రతి పుట్టినరోజున కుటుంబం మొత్తం శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. ఈ క్రమంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాదు టిడిపి నిత్యాన్నదాన ట్రస్టుకు భారీగా విరాళాన్ని అందిస్తారు. ఇలా ఈ ఏడాది కూడా శ్రీవారిని దర్శించుకోనుంది చంద్రబాబు కుటుంబం.
ఇదిలావుంటే అమరావతి భూముల కేసులో తనకు ఆంధ్రప్రదేశ్ సీఐడి జారీ చేసిన నోటీసులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ఆయన సవాల్ చేసారు. ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు.
అమరావతి భూముల కేసులో ఎఫ్ఐఆర్ లను రద్దు చేయాలని ఆయన కోరారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. చంద్రబాబు పిటిషన్ మీద హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. అమరావతి భూముల కేసులో ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు జారీ చేసిన విషయం చేసిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని సిఐడి నారాయణకు నోటీసులు ఇచ్చింది. ఇదే వ్యవహారంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సిఐడి ముందు విచారణకు హాజరయ్యారు.