అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరహార దీక్ష..: అచ్చెన్నాయుడు

By Sumanth KanukulaFirst Published Sep 30, 2023, 2:24 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని చాలా మంది బాధపడుతున్నారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని చాలా మంది బాధపడుతున్నారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను జీర్ణించుకోలేక 97 మంది చనిపోయినట్టుగా తమకు సమాచారం ఉందని చెప్పారు. వారి కుటుంబాలకు తాము సంతాపం తెలుపుతున్నట్టుగా చెప్పారు. త్వరలోనే చనిపోయిన వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెబుతామని అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆయన సతీమణి భువనేశ్వరి అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున నిరహార దీక్ష చేస్తారని తెలిపారు. 

నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఫంక్షన్ హాల్ వద్ద ఈరోజు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, యనమల సహా ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ నుంచి జూమ్ కాల్ ద్వారా హాజరయ్యారు. చంద్రబాబు అరెస్ట్ నుంచి ఇప్పటి వరకు చోటుచేసుకున్న పరిణామాలు, తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమాలపై  ఈ సమావేశంలో చర్చించారు. 

ఈ సమావేశం అనంతరం  అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా.. అక్టోబర్ 2న రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా లైట్లు ఆపి వరంగాలోకి వచ్చి కొవ్వొత్తులతో నిరసన తెలపాలని కోరుతున్నట్టుగా చెప్పారు. ఇప్పటికే టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇరు పార్టీల నుంచి కొంతమందితో కమిటీ ఏర్పాటు చేసుకుని.. క్షేత్రస్థాయిలో పోరాడుతామని తెలిపారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపటి నుంచి 4 రోజుల పాటు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తారని.. ఇందులో టీడీపీ శ్రేణులు పాల్గొని సంపూర్ణ సహకారం ఇవ్వాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. 

click me!