
Tirupati Special Trains: తెలుగు రాష్ట్రాల భక్తులకు, ముఖ్యంగా తిరుమల యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ప్రస్తుత రద్దీ దృష్ట్యా నాందేడ్–తిరుపతి (07015), తిరుపతి–నాందేడ్ (07016) ప్రత్యేక రైళ్లను 2026 మార్చి వరకు పొడిగిస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
నాందేడ్–తిరుపతి ప్రత్యేక రైలు ప్రతి శనివారం నాందేడ్ నుంచి బయలుదేరగా, తిరుపతి–నాందేడ్ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి నడుస్తుంది. ఈ రైళ్లు కరీంనగర్ మీదుగా నడవడం వల్ల, ఆ ప్రాంతం నుంచి భక్తులకు తిరుమల యాత్ర మరింత సులభం కానుంది.
అలాగే, చర్లపల్లి–కాకినాడ ప్రత్యేక రైళ్లు కూడా వచ్చే నెల వరకు పొడిగించనున్నారు. ఇందులో చర్లపల్లి–కాకినాడ టౌన్ (07031) రైలు ఆగస్టు 15, 22, సెప్టెంబర్ 2న, కాకినాడ టౌన్–చర్లపల్లి (07032) రైలు ఆగస్టు 17, 24, 31 తేదీల్లో నడుస్తాయి.
దీనితో పాటు, దక్షిణ మధ్య రైల్వే మొత్తం 54 ప్రత్యేక రైళ్లు కొనసాగనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్–తిరుపతి రూట్‌లో 10 రైళ్లు, కాచిగూడ–నాగర్పోల్ రూట్‌లో 8 రైళ్లు, నాందేడ్–ధర్మవరం రూట్‌లో 10 రైళ్లు సేవలను పొడగించింది. అదనంగా, హైదరాబాద్–కొల్లాం ప్రత్యేక రైలు ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 11 వరకు ప్రతి శనివారం, హైదరాబాద్–కన్యాకుమారి ప్రత్యేక రైలు అక్టోబర్ 8 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది.
మొత్తానికి ఈ నిర్ణయం వల్ల తిరుమల దర్శనానికి వెళ్ళే భక్తులు, అలాగే లాంగ్ జర్నీ చేసే ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణం చేసుకునే అవకాశం లభించనుంది. రైల్వే అధికారులు భక్తులకు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు.