TDP Formation Day 2022: ఈ ప్రస్థానం అప్రతిహాతం... ఆచంద్రతారార్కం అజరామరం..: నందమూరి బాలయ్య

Arun Kumar P   | Asianet News
Published : Mar 29, 2022, 12:35 PM IST
TDP Formation Day 2022: ఈ ప్రస్థానం అప్రతిహాతం... ఆచంద్రతారార్కం అజరామరం..: నందమూరి బాలయ్య

సారాంశం

తెలుగుదేశం పార్టీ  ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ నాయకుల, కార్యకర్తలు, అభిమానులకు హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. 

హైదరాబాద్: ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడకలు (tdp formation day celebrations) ఘనంగా జరుపుతున్నాయి. ఈ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు టిడిపి  జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, పార్టీ జెండాలు చేతబట్టి ర్యాలీలు ఇలా వివిధ రకాలుగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సహా  ఆయన తనయుడు నారా లోకేష్ (nara lokesh), హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna)తో పాటు ఇతర కీలక నాయకులు పార్టీ శ్రేణులకు, తెలుగు ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ టిడిపి ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా తన తండ్రి నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) (NTR) ను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు నందమూరి అభిమానులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 1982లో ఇదే రోజున అంటూ మార్చి 29వ తేదీన స్వర్గీయ ఎన్టీఆర్ టిడిపి స్థాపించారని... అప్పటినుండి ఈరోజు తెలుగువారికి శుభదినంగా మారిందని బాలయ్య పేర్కొన్నారు. 

''ఆ మహానుభావుడు ఎన్టీఆర్ పార్టీని ప్రకటించిన మహూర్తబలం చాలా గొప్పగా వుంది. అందుకే నాలుగు దశాబ్దాలుగా తెలుగునాట పసుపుజెండా సమున్నతంగా రెపరెపలాడుతుంది. 40ఏళ్లుగా పార్టీ ప్రస్థానం అప్రహతిహాతంగా కొనసాగుతోందంటే వేలాదిమంది నాయకులు, లక్షలాది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సులే కారణం. 21ఏళ్లు అధికారంలో ఉండటం, 19ఏళ్లు ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాడటం నిజంగా అద్భుతం. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పోరాటమే మన ఊపిరి... ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి కూడా అదే'' అని బాలకృష్ణ అన్నారు.

''ఆటుపోట్లకు బెదరకుండా, విఘ్నాలకు చెదరకుండా, తెలుగుజాతి అభ్యున్నతే లక్ష్యంగా సాగుతోన్న టిడిపి ప్రస్థానం స్ఫూర్తిదాయకం. పుష్కరకాలం ఎన్టీఆర్ నాయకత్వంలో, గత 28ఏళ్లుగా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం సాధించిన విజయాలు అనన్యసామాన్యం. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ కొత్తశకం లిఖించింది. రాష్ట్రాభివృద్ధిలో, పేదల సంక్షేమంలో టిడిపికి ముందు, టిడిపి తర్వాత అనేలా చరిత్రను తిరగరాసింది'' అన్నారు. 

''ఎన్టీఆర్, చంద్రబాబుల పాలనలో ఎన్నెన్నో అద్భుత విజయాలు, అనితర సాధ్యాలు, వినూత్న పథకాలు దేశానికే దిశానిర్దేశం చేశాయి. ఆడబిడ్డలకు ఎన్టీఆర్ కల్పించిన ఆస్తిహక్కు దేశానికే దిక్సూచి అయ్యింది. రూ 2కిలో బియ్యం ఆహారభద్రతకు బాటవేస్తే, వృద్దులకు నెలకు ఆనాడే ఎన్టీఆర్ ఇచ్చిన రూ.30 పెన్షన్ నేడు నెలకు రూ 2,500 అయ్యింది. సిమెంట్ శ్లాబుతో పేదలకు ఫక్కా గృహాల నిర్మాణం దేశానికే దారిచూపింది. పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీయే'' అని బాలయ్య అన్నారు. 

''తెలుగుగంగ, హంద్రి-నీవా, గాలేరు-నగరి, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ఆధునీకరణ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా తదితర ఎత్తిపోతల పథకాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్నపూర్ణ అయ్యాయంటే అదంతా తెలుగుదేశం ఘనతే. పారిశ్రామికీకరణ కు బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు దేశవిదేశాలనుంచి పెట్టుబడులను రాబట్టి లక్షలాది యువత ఉపాధికి దోహదపడ్డారు. మహిళలు తమకాళ్ల మీద తాము నిలబడేలా చేసిన ఘనత చంద్రబాబుదే. రైతులు, కార్మికులు, యువత, మహిళాభ్యుదయమే తెలుగుదేశం లక్ష్యం'' అన్నారు. 

''తెలుగుదేశం లేని తెలుగురాష్ట్రాల అభివృద్ధిని కలనైనా ఊహించలేం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మానసపుత్రిక తెలుగుదేశం. రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమమే టిడిపి రథ చక్రాలు. తెలుగుదేశం పార్టీ ప్రగతిరథానికి కార్యకర్తలే చోదకశక్తులు. యువత ముందుకు రావాలి, మహిళలు నడుం బిగించాలి, రైతన్న విజయదుందుభి మోగించాలి, కార్మిక సోదరులు కదం తొక్కాలి. రెట్టించిన ఉత్సాహంతో ముందడుగేయాలి. నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేయాలి.'' అని బాలకృష్ణ పిలుపునిచ్చారు. 

''40ఏళ్లే కాదు 400ఏళ్లయినా తెలుగుదేశం పార్టీ తెలుగువారి గుండెల్లో సజీవంగా ఉంటుంది. దుష్టశక్తులెన్ని ఆటంకాలు కల్పించినా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతుంది. పోరాటమే మన ఊపిరని చాటాలి, విజయమే లక్ష్యంగా పోరాడాలి.  ఆ మహనీయుడు ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి అదే.. ఆచంద్రతారార్కం తెలుగుదేశం అజరామరం... జోహార్ ఎన్టీఆర్...తెలుగుదేశం వర్ధిల్లాలి'' అని బాలకృష్ణ అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం