పాలకులను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది తెలుగుదేశమే: చంద్రబాబు నాయుడు

Published : Mar 29, 2022, 11:59 AM IST
పాలకులను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది తెలుగుదేశమే: చంద్రబాబు నాయుడు

సారాంశం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. పార్టీ కార్యకర్తలు అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. పార్టీ కార్యకర్తలు అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.  నలభై సంవత్సరాల క్రితం 1982, మార్చి 29న ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం....ఒక రాజకీయ అనివార్యం. కొందరు వ్యక్తుల కోసమో... కొందరికి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ కాదు మన తెలుగుదేశం. ప్రజల కోసం... ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం....ఈ 40 ఏళ్లలో సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది.

కొందరికే పరిమితం అయిన అధికారాన్ని అన్ని వర్గాలకు పంచింది. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి..సంక్షేమం. సంస్కరణల ఫలితాలను గ్రామ స్థాయికి అందించిన చరిత్ర టీడీపీదే.పాలనపై పాలకులను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది తెలుగుదేశమే. ప్రాంతీయ పార్టీ గా ఉన్నా....జాతీయ భావాలతో సాగే పార్టీ టీడీపీ. పార్టీ చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తుకుతెచ్చేలా తెలుగుదేశం 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించండి. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలి. రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటో ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు సాగాలి’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. 

టీడీపీ ఎన్నారై విభాగంతో చంద్రబాబు.. 
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ ఎన్నారై విభాగం 40 దేశాల్లో వేడుకులను ఘనంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆయా దేశాల్లో స్థిరపడిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో టీడీపీ పుట్టిందని చంద్రబాబు తెలిపారు. సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్ అని.. తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందేన అని అన్నారు. 

 

పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు వంటి సంస్కరణలు ఎన్టీఆర్‌ తెచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫుడ్‌ సెక్యూరిటీ విధానాన్ని..  రూ.2కే కిలో బియ్యం పథకంతో ఎన్టీఆర్ ఎప్పుడో అమల్లో పెట్టారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతం కానుందని చెప్పారు. పార్టీ స్థాపించిన మూహుర్త బలం గొప్పదని అన్నారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా టీడీపీ తట్టుకుని నిలబడుతుందని తెలిపారు. పార్టీని ఎంత ఇబ్బంది పెట్టినా రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తామని చెప్పారు.  ఏ దేశంలో ఉన్నా.. రాష్ట్ర భవిష్యత్తుకు ఎన్నారైలు సహకరించాలని కోరారు. 

టీడీపీ 40 వసంతాల పసుపు పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు టీడీపీ ధైర్యం అని.. కార్యర్తలు బలం అని, పసుపు జెండా పవర్ అని లోకేష్ పేర్కొన్నారు. ‘దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది మా తాత, అభివృద్ధిని పరిచయం చేసింది మా నాన్న. అధికారం ఉన్నా లేకపోయినా ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేద్దాం’ అని లోకేష్ ట్వీట్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం