మార్చెయ్యటానికీ ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త..: నందమూరి బాలకృష్ణ హెచ్చరిక

By Sumanth KanukulaFirst Published Sep 24, 2022, 10:38 AM IST
Highlights

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరుకాదని పేర్కొన్నారు. 

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరుకాదని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అనేది.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక అని అన్నారు. ఈ మేరకు బాలకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడని.. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడని మండిపడ్డారు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారనీ.. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త అంటూ పరోక్షంగా సీఎం జగన్‌‌పై బాలకృష్ణ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. 

‘‘అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..’’ అని బాలకృష్ణ తీవ్ర పదజాలంతో విరుచుపడ్డారు. 

ఇక, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వర్సిటీ పేరు మార్పు బిల్లకు బుధవారం ఏపీ అసెంబ్లీ ఆమోదం  కూడా తెలిపింది. అయితే జగన్ సర్కార్ ‌తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష పార్టీల నేతలు, ఎన్టీఆర్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ప్రముఖ సినీ నటుడు, ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. 

ఎన్టీఆర్, వైఎస్సార్ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరు పేరు పెట్టడం ద్వారా వచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదని.. అలాగే ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్నవారి జ్ఞాపకాలు చెరిపివేయలేరని అన్నారు. 

click me!