ఎన్టీఆర్ జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ అరాచకం... నడిరోడ్డుపై లారీ డ్రైవర్ పై దాడి

By Arun Kumar PFirst Published Sep 24, 2022, 10:32 AM IST
Highlights

విజయవాడ సమీపంలో గత అర్ధరాత్రి బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయింది. రద్దీగా వుండే జాతీయ రహదారిపై నిద్రిస్తున్న లారీ డ్రైవర్ పై అత్యంత క్రూరంగా దాడికి పాల్పడి దారిదోపిడీకి పాల్పడ్డారు. 

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ఇళ్లపై దాడిచేసి అడ్డొచ్చిన వారిని బ్లేడ్ తో గాయపర్చి దోపిడీకి పాల్పడే స్థాయినుండి ఇప్పుడు నడిరోడ్డుపై దారిదోపిడీలకు పాల్పడే స్థాయికి ఈ బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు పెరిగాయి. ఇలా నిత్యం రద్దీగా వుండే జాతీయ రహదారిపై నిద్రిస్తున్న ఓ లారీ డ్రైవర్ పై అత్యంత క్రూరంగా బ్లేడ్లతో దాడిచేసింది ఈ కసాయి బ్యాచ్. ఈ దారుణం గత రాత్రి ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.  

పోలీసుల కథనం ప్రకారం...  కర్నూల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన కలీమ్ (42) లారీ డ్రైవర్. ఇతడు లారీలో లోడ్ తీసుకుని వెళుతూ శుక్రవారం రాత్రి విజయవాడ రూరల్ మండలంలో ఆగాడు. గూడవల్లి జాతీయ రహదారి పక్కన లారీ ఆపి అందులోనే నిద్రించాడు. అయితే అర్ధరాత్రి కలీమ్ గాడనిద్రలో వుండగా బ్లేడ్ బ్యాచ్ ఎంటరై దాడికి తెగబడ్డారు. డబ్బులు, సెల్ ఫోన్ ఇవ్వాలని లారీ డ్రైవర్ ను బెదిరించగా అతడు ప్రతిఘటించాడు.  దీంతో అతడిపై బ్లేడ్ తో అతి దారుణంగా గాయపర్చి ఐదువేల నగదు, సెల్ ఫోన్ ను దొంగిలించారు. 

Read More స్కూటీపై నుంచి జారీ పడ్డ చిన్నారి.. బిడ్డ కోసం దూకేసిన తల్లి, దూసుకొచ్చిన లారీ

బ్లేడ్ బ్యాచ్ దాడిలో తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో పడిపోయిన కలీమ్ ను గుర్తించిన వాహనదారులు 108 కు సమాచారమిచ్చారు. వెంటనే అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకుని కలీమ్ ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 

ఈ బ్లేడ్ బ్యాచ్ దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన కలీమ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోగా అతడు మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో దాడికి సంబంధించిన వివరాలు సేకరించలేకపోయారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 

click me!