జగన్‌ని టార్గెట్ చేసేలా ‘‘వీరసింహారెడ్డి’’ డైలాగ్స్ .. అవి ప్రజల అభిప్రాయాలే : బాలయ్య సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 14, 2023, 6:04 PM IST
Highlights

వీరసింహారెడ్డి సినిమాలో చాలా డైలాగ్‌లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్‌ చేసినట్లుగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. 

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన'వీరసింహా రెడ్డి' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో హనీరోజ్ అలరించింది. ఇక విలన్ షేడ్స్ కలిగిన భానుమతి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించగా, ఐటమ్ నెంబర్ లో చంద్రిక రవి మెరిసింది. మొత్తానికి ఈ సినిమా ఓపినింగ్స్ బాలయ్య కెరీర్‌లో కొత్త రికార్డులకు తెరతీసిందనేది ట్రేడ్ టాక్. కలెక్షన్స్ విషయం ప్రక్కన పెడితే ఈ సినిమా లో పెట్టిన  కొన్ని పొలిటికల్ డైలాగ్స్ గురించి సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బాలయ్య పేల్చిన డైలాగ్స్ థియేటర్‌‌లో ఈలలు వేయించినా.. బయట మాత్రం పెద్ద చర్చకు దారి తీసింది. 

ALso REad: 'వీరసింహా రెడ్డి' లో జగన్ సర్కార్‌పై వేసిన పంచ్ డైలాగ్స్ ఇవే

ఈ నేపథ్యంలో వీరసింహారెడ్డిలో పొలిటికల్ డైలాగ్స్‌పై బాలయ్య స్పందించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారాపల్లికి బాలయ్య కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి చంద్రగిరిలో వీరసింహారెడ్డి సినిమా చూశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఈ సినిమాలోని డైలాగ్స్ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగా వున్నాయంటూ విలేకరి అడిగిన ప్రశ్నకు బాలయ్య స్పందించారు. సాధారణంగా ప్రజల అభిప్రాయాలే సినిమాల్లో వుంటాయని.. సినిమాలు, ప్రజలు వేరు వేరు కాదని ఆయన అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలుసునని.. ప్రస్తుతం ఎమర్జెన్సీ నాటి పరిస్ధితులు ఆంధ్రప్రదేశ్‌లో వున్నాయని బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ద్వారా, పరిస్థితులను తెలియజేశామని ఆయన పేర్కొన్నారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య పేల్చిన పంచ్ డైలాగ్స్ చూస్తే:

‘ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి.. ప్రజల్ని వేధించడం కాదు.. జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. బిచ్చమేయడం కాదు.. పని చేయడం అభివృద్ధి.. పనులు ఆపడం కాదు.. నిర్మించడం అభివృద్ధి.. కూల్చడం కాదు.. పరిశ్రమలను తీసుకుని రావడం అభివృద్ధి.. ఉన్న పరిశ్రమలను మూయడం కాదు. బుద్ధి తెచ్చుకో అభివృద్ధికి అర్థం తెలుసుకో..’ అంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ని టార్గెట్ చేస్తూ బాలయ్య  పంచ్ ఇచ్చాడు. 

సంతకం పెడితే బోర్డుపై పేరు మారొచ్చేమోగాని… చరిత్ర సృష్టించినవారి పేరు మారదు,.. మార్చలేరు …కోస్తా నాకొడకా’.

"ఇది రాయల సీమ.. రాయల్ సీమా.. గజరాజులు నడిచిన దారిలో గజ్జకుక్కలు కూడా నడుస్తుంటాయి.. రాజుని చూడు కుక్కని కాదు."
 

click me!