విదేశీ మోజును బాగానే తీర్చుకుంటున్నారు

First Published Mar 4, 2017, 4:35 AM IST
Highlights

చంద్రబాబు విదేశీ మోజును ఉన్నతాధికారులు బాగానే ఉపయోగించుకుంటున్నారు.

చంద్రబాబునాయుడుకు విదేశాలపై ఉన్న మోజును ఉన్నతాధికారులు బాగానే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. పెట్టుబడుల వేటకు 12 దేశాల్లో రోడ్డు షోలు, 14 విశ్వ పెట్టుబడుల సదస్సుల్లో పాల్గొంటారట. విదేశీ పర్యటనలన్నీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు (ఇడిబి)ఆధ్వర్యంలో జరగుతాయట. పెట్టుబడుల సాధన కోసం 2017-18 సంవత్సరానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను సిఎం ఆమోదించారు. పెట్టుబడుల కోసం అమెరికా నుండి తైవాన్ వరకూ ఏ దేశాన్నీ వదల కూడదని నిర్ణయించటం విశేషం.

 

అమెరికా, యూరప్ లో చెరో మూడు రోడ్ షోలు, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లో చెరోటి, ఇంగ్లండ్, కెనడాల్లో చెరోటి నిర్వహించాలని నిర్ణయమైంది. చైనా, రష్యాలో రెండు చొప్పున, జపాన్, తైవాన్లో చెరో రోడ్ షో నిర్వహించనున్నారు. ఉత్తినే రోడ్ షోలు నిర్వహించి, ఎంఒయులు కుదుర్చుకొవటం కాదని, పెట్టుబడులు తేవాలంటూ సిఎం గట్టిగా చెప్పటం గమనార్హం. మన రాష్ట్రంలో వ్యాపారవకాశాలపై విదేశాల్లో స్పష్ట చేయాలట.

.

సమావేశాలు నిర్వహించటం, లక్ష్యాలను నిర్దేశించటం బాగానే ఉంది. మరి పెట్టుబడుల కోసమే చంద్రబాబు ఆధ్వర్యంలో రెండున్నరేళ్ళలో జరిపిన విదేశీ పర్యటనలన్నీ ఏమయ్యాయో? పెట్టుబడుల పేరుతోనే కదా చంద్రబాబు సుమారు 20 దేశాల్లో తిరిగింది? రెండుసార్లు దావోస్ కు వెళ్ళివచ్చారు. 2015-16 సంవత్సరంలో విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు తర్వాత రూ. 2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినట్లు చంద్రబాబే చెప్పారు. మొన్న జనవరి  నెలలో జరిగిన రెండో సదస్సులో ఏకంగా రూ. 10.54 లక్షల కోట్ల విలువైన ఎంఒయులైపోయినట్లు చెప్పారు. అదేదో మొత్తం పెట్టుబడులే అన్నట్లు.

 

విశాఖలో జరిపిన సదస్సుల వల్లే అన్నేసి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తుంటే మళ్ళీ విదేశాలకెందుకు? విదేశాల్లో రోడ్ షోలు, పెట్టుబడుల సదస్సులో పాల్గొనే పేరుతో కోట్ల రూపాయలు తగలేయటం తప్ప? ఈడిబి సమావేశంలో సీఈఓ కృష్ణకిషోర్ వివరాల ప్రకారమే దావోస్ పర్యటన వల్లగానీ, విశాఖలో నిర్వహించిన సదస్సుల్లో గాని ఇన్ని కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు వచ్చినట్లు ఎక్కడా చెప్పలేదు. అన్నీ ప్రతిపాదన దశల్లోనే ఉన్నట్లు చెప్పారు. రెండున్నరేళ్ళయినా ఇంకా ప్రతిపాదనల దశల్లోనే ఉన్నాయంటే అర్ధమేమిటి? వచ్చే సంవత్సరం పూర్తయితే ఇక మిగిలిందంతా ఎన్నికలే. మొత్తానికి చంద్రబాబు విదేశీ మోజును ఉన్నతాధికారులు బాగానే ఉపయోగించుకుంటున్నారు.

 

 

 

 

 

 

click me!