కాపు రిజర్వేషన్లను కేంద్రం అంగీకరిస్తుందా ?

First Published Dec 2, 2017, 11:31 AM IST
Highlights
  • ‘కాపులను బిసిల్లోకి చేర్చటం వల్ల రిజర్వేషన్లు 50 శాతం దాటిపోయింది కాబట్టే దాన్ని ఆమోదించాలంటూ కేంద్రానికి తీర్మానం పంపుతున్నాం’..ఇది తాజాగా అసెంబ్లీలో చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు.

‘కాపులను బిసిల్లోకి చేర్చటం వల్ల రిజర్వేషన్లు 50 శాతం దాటిపోయింది కాబట్టే దాన్ని ఆమోదించాలంటూ కేంద్రానికి తీర్మానం పంపుతున్నాం’..ఇది తాజాగా అసెంబ్లీలో చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు. మంత్రివర్గం ఆమోదించినంత మాత్రాన, అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన కాపులకు రిజర్వేషన్ ఇవ్వటం చెల్లుబాటవుతుందా? ఇపుడదే ప్రశ్న అందరిలోనూ అనుమానాలు రేపుతోంది. సాంకేతికంగా చూస్తే కాపులను బిసిల్లోకి చేర్చటమన్నది రాష్ట్రప్రభుత్వానికి సాధ్యం కాదు. ఎందుకంటే, రిజర్వేషన్ల అంశమన్నది కేంద్రప్రభుత్వ పరిధిలోని అంశం.

కేంద్రం ప్రభుత్వం చేయాల్సిన పనిని రాష్ట్రప్రభుత్వం చేస్తానంటే సాధ్యమవుతుందా ? పోనీ కేంద్రమైనా తన ఇష్టప్రకారం చేసే అవకాశం ఉందా? అంటే లేదనే చెప్పాలి. రిజర్వేషన్ల పరిధిని పెంచాలన్నా, తగ్గించాలన్నా, సామాజిక వర్గాలను రిజర్వేషన్ల పరిధిలోకి చేర్చాలన్నా అది పార్లమెంటు ద్వారానే జరగాలి. లేకపోతే న్యాయస్ధానాలు అంగీకరించవు. గతంలో రాష్ట్రప్రభుత్వాలు చేసిన తీర్మానాలను, అమలును కోర్టులు కొట్టేసిన ఉదాహరణలు కోకొల్లలు.

తాజాగా తెలంగాణాలో కూడా ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కెసిఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు కొట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే తర్వాత మరో తీర్మానం చేసి అమలు చేయాలని కోరుతూ కేంద్రానికి తీర్మానాన్ని పంపారు. సరే, ఆ తీర్మానాన్ని కేంద్రం పట్టించుకుంటుందా అంటే అది వేరే సంగతి. ప్రాంతీయ పార్టీలిచ్చే రాజకీయ హామీలను కేంద్రం ఎందుకు పట్టించుకుంటుంది?

ఇక్కడ కూడా కాపులను బిసిల్లోకి చేర్చలాన్న హామీ పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చారు. చంద్రబాబు హామీకి మిత్రపక్షం భాజపాకు ఏమీ సంబంధం లేదు. అందులోనూ కేంద్రం-చంద్రబాబు మధ్య సంబంధాలు అంత బాగాలేవు కూడా. రాజధానికి నిధులు మంజూరు, పోలవరం కాంట్రాక్టరును మార్చటం, అంచనా వ్యయాలు పెంచటం..అంశం ఏదైనా కానీ చంద్రబాబు నిర్ణయాలకు కేంద్రం అంగీకరించటం లేదు. ఇటువంటి పరిస్ధితుల్లో కాపులను బిసిల్లోకి చేర్చాలన్న చంద్రబాబు రాజకీయ నిర్ణయాన్ని కేంద్రం ఎందుకు ఆమోదిస్తుంది? ఛాన్సే లేదు.

ఇంతచిన్న విషయం చంద్రబాబుకు తెలీదా? ఎందుకు తెలీదు ? బాగా తెలుసు? కేంద్రం ఆమోదించకపోవటమే చంద్రబాబుకు కావాల్సింది. ఎందుకంటే, కాపులకు తాను రిజర్వేషన్లు కల్పించాలని అనుకున్నా కేంద్రం అనుమతించటం లేదని రేపటి ఎన్నికల్లో చెప్పుకోవాలి. అంటే జనాల ముందు భాజపాను దోషిగా నిలబెట్టటమే చంద్రబాబు ఉద్దేశ్యంగా కనబడుతోంది. ఇదంతా ఎప్పుడంటే 2019 ఎన్నికల్లో భాజపా-టిడిపి విడిపోతేనే సుమా? అందుకనే చంద్రబాబు సొంతంగా ఎన్నికలను ఎదుర్కోవటానికి ఇప్పటి నుండే రంగం సిద్ధం చేసుకుంటున్నట్లే కనబడుతోంది.

click me!