
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సమర్ధవంతంగా ఎదుర్కోగలిగే జట్టుకోసం చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నారు. మూడేళ్ళక్రితం ఏర్పడ్డ ప్రస్తుత జట్టు అంత సమర్ధవంతంగా పనిచేయటం లేదని ఆయనలో అసంతృప్తి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త జట్టు ఏర్పాటుకు ఏప్రిల్ 6వ తేదీ ముహూర్తంగా ప్రచారమవుతోంది. కొత్తగా శాసనమండలిలోకి ప్రవేశిస్తున్న లోకేష్ కూడా ఈ జట్టులో ఉంటారన్నది ఖాయమైపోయింది. మిగిలినవారెవరన్న విషయంలోనే రకరకాల ప్రచారాలు సాగుతున్నాయ్.
ప్రతిపక్షనేతగా జగన్ సమర్ధవంతంగా పనిచేస్తున్నారు. అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. గతంలో కన్నా ఈ బడ్జెట్ సమావేశాల్లో పరిణతి కనబరుస్తున్నారు. దాంతో ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. జగన్ వేస్తున్న ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం సమాధానాలు చెప్పలేక పోతోంది. కారణాలు స్పష్టంగా తెలీదుగానీ గతంలోలా పలువురు మంత్రులు జగన్ పై ఒంటికాలిపై లేవటం లేదు.
గతంలో మంత్రులు రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాధరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయడు తదితరులు ప్రతీ చిన్న విషయానికీ జగన్ పై ఎగిరెగిరి పడేవారు. ఇపుడు ఆ పరిస్ధితి కనబడటం లేదు. ఆ విషయం అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టంగా కనబడుతోంది. ఈ విషయం సిఎం దృష్టిలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దానకితోడు మంత్రుల పనితీరు పట్ల కూడా సిఎం అనేక సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తంచేసారు. మంత్రివర్గంలోని పీతల సుజాత, ఋకిమిడి మృణాళిని, పల్లె రఘునాధరెడ్డి, రావెల కిషోర్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విషయంలో సిఎం అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
లోకేష్ తో పాటు మరికొందరిని మంత్రివర్గంలోకి తీసుకోవటం ద్వారా జగన్ ను కట్టడి చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. పనితీరంటే, శాఖలను సమర్ధవంతంగా నిర్వహించటమే కాకుండా ప్రతిపక్షాన్ని గట్టిగా ఎదుర్కొనే సాసమర్ధ్యం కూడా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. అటువంటి వారికోసమే చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. చూద్దాం జగన్ను ఎదుర్కొనే కొత్త బృందంలో ఎవరెవరుంటారో త్వరలో తెలిసిపోతుంది కదా?