ప్రభుత్వం సిగ్గు పడాలి

First Published May 15, 2017, 2:24 AM IST
Highlights

అధ్యయనం పేరుతో లక్షల రూపాయలు ఖర్చు మాత్రం చేసారు. ఇప్పటికి మూడేళ్ళయిపోయింది కానీ అన్న క్యాంటిన్లకు మాత్రం మోక్షం కలగలేదు. రాష్ట్రం మొత్తం మీద 40 చోట్ల అన్న క్యాంటిన్లు ప్రారంభిస్తున్నట్లు మంత్రులు ఎన్నోమార్లు ప్రకటించారు.

ప్రభుత్వం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం ఇది. పేదలకు భోజనాన్ని అందించే ఉద్దేశ్యంతో అన్నక్యాంటిన్లు ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబునాయుడు మూడేళ్ళ క్రితం ఆర్భాటంగా ప్రకటించారు. తమిళనాడులోని అమ్మ క్యాంటిన్ల తరహాలో రాష్ట్రంలో కూడా పథకాన్ని అమలు చేస్తామన్నారు. పథకాన్ని అధ్యయనం చేసేందుకు మంత్రులతో కమిటీ కూడా వేశారు. మంత్రులు ఒకటికి రెండుసార్లు తమిళనాడుకు కూడా వెళ్లి వచ్చారు. తర్వాత అధికారులు కూడా ఎన్నోమార్లు తమిళనాడు చుట్టి వచ్చారు.

ముఖ్యమంత్రితో కూడా పలుమార్లు భేటీ అయ్యారు. ఏం లాభం? అడుగు ముందుకు పడలేదు. అధ్యయనం పేరుతో లక్షల రూపాయలు ఖర్చు మాత్రం చేసారు. ఇప్పటికి మూడేళ్ళయిపోయింది కానీ అన్న క్యాంటిన్లకు మాత్రం మోక్షం కలగలేదు. రాష్ట్రం మొత్తం మీద 40 చోట్ల అన్న క్యాంటిన్లు ప్రారంభిస్తున్నట్లు మంత్రులు ఎన్నోమార్లు ప్రకటించారు. ఎక్కడెక్కడ ప్రారంభించబోయేది జాబితా కూడా వినిపించారు. రోజుకు ఎంతమంది భోజనం చేస్తారు? నెలకు ఎంతవుతుంది? ఎన్ని వేల కిలోల బియ్యం, ఇతర సరుకులు కావాలనే లెక్కలు చాలానే వినిపించారు.

సంవత్సరాల తరబడి మంత్రలు, ఉన్నతాధికారుల సమావేశాలు, అధ్యయనాలు జరుగుతుండగానే ఓ ఎంఎల్ఏ ‘రాజన్న భోజన పథకా’న్ని ప్రారంబించేసారు. మంగళగిరి నియోజకవర్గంలో పేదల భోజన పథకాన్ని ప్రారంభించాలని ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనుకున్నారు. వెంటనే హైదరాబాద్ లో అమలవుతున్న 5 రూపాయల భోజనపథకాన్ని స్వయంగా పరిశీలించారు. కొద్దిపాటి మార్పులు, చేర్పులతో పథకాన్ని ఆదివారం ప్రారంభించేసారు. తన సొంత ఖర్చులతో రోజుకు సుమారు 500 మందికి భోజనం పెట్టేందుకు వీలుగా పథకాన్ని మొదలుపెట్టారు.

భోజనంలో కూర, పెరుగన్నం అందిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు ఒక కోడిగుడ్డు, మిగిలిన మూడు రోజులు అరటిపండు, అప్పడం, వడియాల్లాంటివి ఇస్తారట. మంగళగిరిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతీ రోజు మధ్యాహ్నం సుమారు 500 మంది పేదలకు భోజనం పెట్టేందుకు ప్రస్తుతానికి ఏర్పాట్లు చేసారు.

మెల్లిగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే యోచనలో ఉన్నట్లు ఎంఎల్ఏ చెప్పారు. లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ అని గొప్పగా చెప్పుకునే ప్రభుత్వం పేదలకు భోజనం పెట్టే పథకాన్ని మూడేళ్ళుగా ప్రారంభించలేకపోయింది. ఒక ఎంఎల్ఏ అదికూడా ప్రతిపక్ష ఎంఎల్ఏ సొంత ఖర్చులతో ప్రారంభించటం ప్రభుత్వానికి నిజంగా సిగ్గుచేటు.

 

 

 

 

click me!