పవన్ కు ఏమీ తెలీదు..జగన్ కు అర్ధం కాదు..

First Published Dec 11, 2017, 2:22 PM IST
Highlights
  • పోలవరం ప్రాజెక్టు గురించి ఏమీ తెలీకుండానే అందరూ మాట్లాడేస్తున్నట్లు చంద్రబాబునాయుడు మండిపడ్డారు.

పోలవరం ప్రాజెక్టు గురించి ఏమీ తెలీకుండానే అందరూ మాట్లాడేస్తున్నట్లు చంద్రబాబునాయుడు మండిపడ్డారు. సోమవారం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సైట్ విజిట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎవరైనా పోలవరం గురించి మాట్లాడేటప్పుడు ముందు వివరాలు తెలుసుకుని మాట్లాడాలంటూ చురకలంటించారు. ఇటీవలే పోలవరం సైట్ ను సందర్శించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, జరుగుతున్న పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికే వదిలిపెట్టేస్తానని చెప్పిన చంద్రబాబును ఉద్దేశించి కూడా ఘటుగా మాట్లాడారు. సరే, ఇక వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

ఇవన్నీ మనసులో ఉంచుకున్న చంద్రబాబు ఈరోజు మాట్లాడుతూ, ‘ప్రాజెక్టు గురించి పవన్ కు  ఏమీ తెలీదు..జగన్ కు చెప్పినా అర్ధం చేసుకోరు’ అంటూ ఎద్దేవా చేసారు. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలు తెలుసుకోవటంలో తప్పులేదన్నారు. అందరికీ అన్నీ విషయాలు తెలియాలని ఏమీ లేదన్నారు. తాను వారం వారం వస్తుంటేనే కొన్ని సాంకేతిక అంశాలు అర్ధం కావటంలేదన్నారు. అటువంటిది ఏమీ తెలీకపోయినా అన్నీ తెలిసినట్లు మాట్లాడుతున్నవారితోనే సమస్యలు వస్తున్నాయంటూ మండిపడ్డారు. డయాఫ్రం వాల్ అంటే ఏమిటో కూడా తెలీని వాళ్ళు ప్రాజెక్టు గురించి మాట్లాడ్డమేంటని చంద్రబాబు మండిపడ్డారు.

ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న పవన్ డిమాండ్ ను ఉద్దేశించి  మాట్లాడుతూ, ప్రతీ వారం ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు ప్రకటిస్తున్నపుడు ప్రత్యేకించి శ్వేతపత్రం అవసరం లేదని తేల్చేసారు. ప్రాజెక్టు వివరాలు పారదర్శకంగా  అందిస్తున్నట్లు కూడా చెప్పారు. ఓ ప్రాజెక్టు గురించి ఇంత స్పష్టంగా తెలిపిన దాఖలాలు లేవని కూడా చెప్పుకున్నారు. ప్రాజెక్టను పూర్తి చేయటమే ధ్యేయంగా సిఎం వివరించారు. ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకూ రూ. 12, 567 కోట్లు వ్యయం చేశామన్నారు. 98 వేల కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ అమలు చేయాలని తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ. 17 లక్షల వరకూ పరిహారం అందించాలని చెప్పారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఆర్ అండ్ ఆర్ చట్టం వల్లే ప్రాజెక్టు వ్యయం 11 రెట్లు పెరిగిపోయిందిన్నారు.  

 

click me!