పెద్ద నోట్ల వల్ల అవినీతి పెరుగుతుందట....

First Published Sep 27, 2017, 11:08 AM IST
Highlights
  • చంద్రబాబునాయుడు మాటలకు చేతలకు ఏమాత్రం సంబంధం ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే.
  • రూ. 2 వేల నోట్లను రద్దు చేయాలని ఆయన చేసిన తాజా వ్యాఖ్యలే అందుకు అద్దం పడుతోంది.
  • ఢిల్లీలో ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ, పెద్దనోట్ల వల్ల అవినీతి ఎక్కువవుతుందని అభిప్రాయపడ్డారు.
  • ఏవన్నా సంస్కరణలు చేపడితే ఫలితాలు రావటానికి సమయం పడుతుందన్నారు.
  • పెద్ద డినామినేషన్ల వల్ల చాలా సమస్యలున్నాయని నమ్ముతున్న వాళ్ళల్లో  చంద్రబాబు కూడా ఒకరట.

చంద్రబాబునాయుడు మాటలకు చేతలకు ఏమాత్రం సంబంధం ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. రూ. 2 వేల నోట్లను రద్దు చేయాలని ఆయన చేసిన తాజా వ్యాఖ్యలే అందుకు అద్దం పడుతోంది. ఢిల్లీలో ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ, పెద్దనోట్ల వల్ల అవినీతి ఎక్కువవుతుందని అభిప్రాయపడ్డారు. ఏవన్నా సంస్కరణలు చేపడితే ఫలితాలు రావటానికి సమయం పడుతుందన్నారు. పెద్ద డినామినేషన్ల వల్ల చాలా సమస్యలున్నాయని నమ్ముతున్న వాళ్ళల్లో  చంద్రబాబు కూడా ఒకరట.

ప్రధానంగా రాజకీయక్షేత్రంలో రూ. 2 వేలనోట్ల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పటం గమనార్హం. నిజానికి రూ. 2 వేల నోట్ల వల్ల లబ్దిపొందిందే చంద్రబాబు. ఎలాగంటే, మొన్నటి నంద్యాల ఉపఎన్నికైనా, కాకినాడ కార్పొరేషన్లో అయినా టిడిపి కోట్లాది రూపాయలను విచ్చలవిడిగా వెదచల్లిందన్నది వాస్తవం. పంపిణీ జరిగినదానిలో ఎక్కువగా రూ. 2 వేల నోట్లే ఉన్నాయి. నిజానికి అప్పుడు 2 వేల రూపాయల నోటే లేకపోతే డబ్బు పంపిణీలో టిడిపి బాగా ఇబ్బంది పడిపోయేదే. అటువంటిది రూ. 2 వేల నోట్ల వల్ల రాజకీయక్షేత్రంలో సమస్యలున్నట్లు చంద్రబాబు చెప్పటం ఆశ్చర్యం.

పైగా డిజిటల్ కరెన్సీని ఎక్కువగా ప్రమోట్ చేస్తే సమస్యను కొంత వరకూ అదుపులో పెట్టవచ్చట. నోట్ల రద్దు సమయంలో డిజిటల్ కరెన్సీ గురించి ఊరువాడ ఊదరగొట్టిన చంద్రబాబు తర్వాత అసలు ఆ విషయం గురించే మాట్లాడ్డం మానేసారు. ఎందుకంటే, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న మనదేశంలో డిజిటల్ కరెన్సీ అమలు చేయటం సాధ్యం కాదన్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఎవరికో లబ్ది చేకూర్చేందుకే నోట్ల రద్దు, డిజిటల్ కరెన్సీ లాంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం తెరలేపిందన్న ఆరోపణలకు కొదవేలేదు.

వెయ్యి, 500 రూసాయల నోట్లతో బ్లాక్ మనీ పెరిగిపోతోందని చెప్పిన ప్రభుత్వం హటాత్తుగా వాటిని రద్దు చేసి వాటి స్ధానంలో మళ్ళీ రూ. 2 వేల నోట్లను తేవటంతోనే కేంద్రం తుగ్లక్ చర్య బయటపడింది. మళ్ళీ దానికి చంద్రబాబు సమర్ధింపు వేరే. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలిపోయిందన్నది వాస్తవం. అటువంటిది మళ్ళీ రూ. 2 వేల నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు అంటున్నారంటే దీని వెనుక ఏదో మతలబు ఉండే వుంటుంది.

click me!