
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ సభ్యులను నియంత్రించేందుకు రెడ్ లైన్ ఏర్పాటు చేయాలని చంద్రబాబునాయుడు సూచించటం గమనార్హం. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ, ప్రతిపక్షం సభా సమయాన్ని వేస్ట్ చేస్తోందని ఆరోపించటం గమనార్హం. సభా సమయం వృధా కావటంలో ప్రతిపక్షంతో పాటు అధికార పక్షానిది కూడా అంతే బాధ్యతుంది. ప్రజల గొంతుకను వినిపించటంలో ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీయటం మామూలే. అందుకే అధికారపక్షానికి ఓపికి అవసరం.
గడచిన మూడేళ్ళుగా సభ నడుస్తున్న తీరు చూస్తే అధికార-ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు వ్యక్తిగతంగా దూషించుకోవటంతోనే సమయం మొత్తం వృధా అయిపోయింది. ఎక్కడ అవకాశం దొరికినా అధికార పార్టీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగతంగా విరుచుకుపడుతోంది. అదేవిధంగా జగన్ కూడా చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఒకరకంగా ఇద్దరి మధ్యా ‘ఇగో ప్రాబ్లెం’ వల్లే విలువైన సభా సమయం మొత్తం వృధాగా పోతోందన్నది వాస్తవం. చివరిరోజు సమావేశాలు కూడా షరామామూలుగానే జరిగింది.
ఈ నేపధ్యంలోనే చంద్రబాబు మాట్లాడుతూ, విపక్షాన్ని నియంత్రించేందుకు రెడ్ లైన్ ఏర్పాటు చేయాలని స్పీకర్ కు సూచించటం గమనార్హం. సిఎం సూచించారంటే వచ్చే సమావేశాల్లో పాటించక తప్పదు కదా? పైగా రెడ్ లైన్ దాటగానే ప్రతిపక్ష సభ్యులు ఆటోమేటిక్ గా సస్పెండ్ చేయాలని కూడా సూచించారు. అధికార పార్టీ సభ్యులకైనా అదే నిబంధన వర్తింపచేయాలన్న గొప్ప మనసును కనబరిచారు. అధికార పార్టీ సభ్యులెందకు వెల్ లోకి వస్తారు? ఆ విషయం చంద్రబాబుకు తెలీదా? అంటే వచ్చే సమావేశాల నుండి ప్రతిపక్ష సభ్యులను రెడ్ లైన్ పేరుతో సస్పెండ్ చేయమని స్పీకర్ కు గట్టి సూచనలు ఇచ్చారన్నమాట.